తమిళ సినీ పరిశ్రమలో రజనీకాంత్ ఎరాకు దాదాపు తెరపడినట్లే. ఇప్పుడు అక్కడ హవా అంతా విజయ్, అజిత్లదే. ఫాలోయింగ్, మార్కెట్, ఇమేజ్ విషయంలో వీళ్లిద్దరూ దాదాపు సమాన స్థాయిలో ఉంటారు. వీళ్లిద్దరూ కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీగా తలపడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు రికార్డులు నెలకొల్పుతున్నారు. బద్దలుకొడుతున్నారు.ఈ ఇద్దరు హీరోలు చాలా సింపుల్‌గా.. వివాదాలకు దూరంగా ఉంటారు కానీ.. వారి అభిమానులు మాత్రం నిరంతరం కొట్టుకు చస్తుంటారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగాక వీళ్ల ఫ్యాన్ వార్స్ మరీ శ్రుతి మించి పోతున్నాయి. ఒక హీరో అభిమానులు ఇంకో హీరో అభిమానుల మీద దుమ్మెత్తిపోయడం.. తీవ్ర స్థాయిలో దూషించుకోవడం సాధారణమైపోయింది. ఈ ఒరవడినే ఇతర సినీ పరిశ్రమల అభిమానులు కూడా అందిపుచ్చుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో అజిత్‌ను తనకు గొప్ప స్నేహితుడిగా పేర్కొంటూ తన సినిమా మాస్టర్ ఆడియో వేడుకలో విజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు విజయ్ సూట్ వేసుకుని వచ్చాడు. దీని గురించి మధ్యలో యాంకర్ ప్రశ్నించగా.. తాను తన మిత్రుడు అజిత్‌ను చూసి ఈ సూట్ వేసుకొచ్చానని.. తామిద్దరం వేరు కాదని, ఇద్దరం ఒకటే అని వ్యాఖ్యానించాడు విజయ్.తనకు పోటీగా ఉన్న స్టార్ హీరో గురించి విజయ్ ఇలాంటి కామెంట్ చేయడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. దీనిపై సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. విజయ్ పేర్కొన్న నన్బర్ అజిత్ (స్నేహితుడు అజిత్) అన్న మాటను హ్యాష్ ట్యాగ్‌గా పెట్టి నెటిజన్లు పెద్ద ఎత్తున ట్వీట్లు వేస్తున్నారు. ఎప్పుడూ విజయ్ను తిట్టిపోసే అజిత్ ఫ్యాన్స్ కూడా అతడిపై ప్రశంసలు కురిపిస్తుండటం విశేషం.