బాలయ్య రూట్ లోనే విజయ్ దేవరకొండ…!

Vijay Devarakonda As Singareni Worker In Kranthi Madhav Film

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. గతేడాది రెండు హిట్లు కొట్టిన ఈ హీరో ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాల్లో ఒకటి భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న డియర్ కామ్రేడ్ కాగా మరొకటి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కొత్తగూడెంలో జరుగుతోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సింగరేణి కార్మికుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే, నందమూరి బాలకృష్ణ తరవాత సింగరేణి కార్మికుడి పాత్రను చేస్తోన్న హీరో విజయ్ దేవరకొండ.

సుమారు 22 ఏళ్ల క్రితం వచ్చిన ‘నిప్పురవ్వ’ సినిమాలో బాలకృష్ణ సింగరేణి కార్మికుడిగా కనిపించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఓ తెలుగు హీరో ఆ పాత్రలో మెరవనున్నారు. అప్పట్లో ‘నిప్పురవ్వ’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. మరి విజయ్ దేవరకొండ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి. అయితే సింగరేణి కార్మికుడి పాత్ర సినిమాలో ఒక భాగం మాత్రమే అని అంటున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. క్రాంతి మాధవ్ గతంలో ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ వంటి మంచి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి క్లాస్, మాస్‌ను అలరించే హీరోతో కొత్త ప్రయోగం చేస్తున్నారు.