Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హిందూ భావజాల నేపథ్యమున్న బీజేపీ నేతలు ప్రస్తుత విషయాలన్నింటినీ… పురాణాలతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న సాంకేతిక టెక్నాలజీ మనదేశంలో ప్రాచీనకాలంలోనే ఉందంటూ కొత్త భాష్యాలు చెబుతున్నారు. రైట్ బ్రదర్స్ కన్నా ముందు శివకర్ బాపూజీ అనే భారతీయుడు విమానాన్ని కనుగొన్నారని, అసలు రామాయణంలో ప్రస్తావనకు వచ్చే పుష్పకవిమానం గురించి ఐఐటీ విద్యార్థులకు బోధించాల్సిన అవసరముందని కొన్నినెలలక్రితం కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రుల వంతు వచ్చింది. కొన్నిరోజుల క్రితం త్రిపుర కొత్త ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ మహాభారత సమయంలోనే ఇంటర్నెట్ ఉందని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిప్లబ్ దేబ్ కు అధిష్టానం నుంచి పిలుపుకూడా వచ్చింది. ప్రతి విషయాన్నీ పురాణాలకు ఆపాదిస్తున్న బీజేపీ నేతల తీరుపై సామాన్య ప్రజలనుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ… వారి తీరులో మార్పు రావడం లేదు.
తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సమాచారం కోసం సమస్త ప్రపంచం ఆధారపడుతున్న గూగుల్ ను నారదుడితో పోల్చారు. ఆదివారం అహ్మదాబాద్ లో నిర్వహించిన దేవర్శి నారద్ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ రూపానీ… అక్కడ ప్రసంగించారు. గూగుల్ మనకు అచ్చం బ్రహ్మపుత్రుడి నారదుడిలాగే ఎంతో సమాచారం ఇస్తుందని వ్యాఖ్యానించారు. నారదుడికి ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసని, అదే విధంగా గూగుల్ కూడా అని విజయ్ రూపానీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నారదుడు రామాయణంలో ఉన్నాడని, మహాభారతంలో ఉన్నాడని, అక్కడి విషయాలు ఇక్కడ, ఇక్కడి విషయాలు అక్కడ చెప్తుండేవాడని, తనకు తెలిసి భూమిపై తొలి పాత్రికేయుడు నారదుడేనేమోనన్నారు. నారదుడు ఏం చేసినా లోకకళ్యాణం కోసమే చేశాడని వ్యాఖ్యానించారు. విజయ్ రూపానీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే త్రిపుర ముఖ్యమంత్రి వ్యాఖ్యలను పక్కన పెడితే… విజయ్ రూపానీ చేసిన నారదుడు తొలి జర్నలిస్ట్ అన్న వ్యాఖ్య మాత్రం జర్నలిజంలో నానుడిలో ఉన్న సంగతే. జర్నలిస్టులుగా కెరీర్ ప్రారంభించేవారికిచ్చే శిక్షణలో ప్రపంచంలో తొలి విలేకరి నారదుడు అని చెబుతుంటారు. కొందరు విమర్శకులు కూడా జర్నలిస్టులను నారదునితో పోలుస్తుంటారు.