విజయసాయి భక్తి శ్రీవారి మీదా ? లేక మోడీ మీదా ?

Vijaya Sai Reddy writes book on Lord Venkateswara Swamy

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల్లో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయ‌నే కీల‌కం… జ‌గ‌న్ కూడా తాను ఎంత చెబితే అంత‌. సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న తర్వాత ఏ-1గా జగన్, ఏ -2గా విజయసాయిరెడ్డి పాపులర్ అయిపోయారు. వైసీపీలోనూ ఇప్పుడు అదే నెంబర్ వన్ జగన్ అయితే నెంబర్ 2 పొజిషన్‌ను విజయసాయి మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి కొత్తగా ఒక అవతారం కూడా ఎత్తారు. అదే రచయిత అవతారం, ఆయన ఆడిటర్ కాబట్టి ఎకనామిక్ సైన్సు బుక్కో, లేక పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి పొలిటికల్ సైన్సు బుక్కో అనుకుంటే మీరు పోరబడ్డట్ట్లే ఆయన రాసింది డివోషనల్ బుక్, అది కూడా ఇప్పుడు వివాదాల్లో నలుగుతున్న తిరుమల వెంకన్న మీద. “గ్లోరీ ఆఫ్ వెంకటేశ్వర” అనే పుస్తకాన్ని రాశారు. ముందు తెలుగు ఒక్కటే అనుకున్నా తర్వాత హిందీ, ఇంగ్లిష్‌లో కూడా విడుదల చేయాలని కొద్ది రోజుల కిందట నిర్ణయించారు.

ఇక్కడ విషయం ఏంటి అంటే అసలే వెంకన్నను అడ్డుపెట్టుకుని రకరకాల షోలు రన్ అవుతున్న క్రమంలో, పైగా రమణ దీక్షితుల వ్యవహారం తరువాత టీటీడీ విషయంపై రోజుకొక కధ బయటకు వస్తున్న క్రమంలో, దీక్షితులను అక్కడ నుంచి బయటకు పంపిన వెంటనే, ఆయన వెళ్ళి జగన్ ని కలవడం, టీటీడీ దేవస్థానంలోని ఆభరణాలు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని, ఆయన ఇంట్లో సోదాలు జరిపితే శ్రీవారి ఆభరణాలు బయటపడతాయని ఇటీవల విజయసాయి వ్యాఖ్యలు చేయడం, ఇలా ఇవన్నీ కలిపి చూస్తూ౦టే, విజయ్ సాయి రెడ్డి వెంకన్నను అడ్డు పెట్టుకుని మళ్లీ రాజకీయ క్రీడా మొదలుపెట్టారేమో అని పొలిటికల్ వర్గాలు భావిస్తున్న్నాయి. ప్రస్తుతం పుస్తకాల ప్రతులు తీసుకుని మఠాల సందర్శనకు వెళ్తున్నారు. స్వామీజీలకు బహుకరించి ఆశీర్వాదాలు తీసుకుని వస్తున్నారు. ఇంత వరకూ బాగున్నా… ఇప్పుడీ పుస్తకాన్ని గుజరాతీలోకీ అనువదీస్తున్న విషయం మరిన్ని చర్చలకి తావిస్తోంది.

సాధారణంగా శ్రీవారిపై పుస్తకాలు ఎవరైనా రాస్తే మాతృభాషలో రాసుకుంటారు. శ్రీవారిపై తమ భక్తిని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుంటే ముందుగా తెలుగులోకి తర్వాత తమిళంలోకి ఆ తర్వాత కన్నడలోకి అనువదిస్తారు ఎందుకంటే.. శ్రీవారి భక్తగణం అక్కడ ఎక్కువగా ఉంటుంది. కానీ విజయసాయిరెడ్డి తమిళం, కన్నడం వదిలేసి… గుజరాతీలోకి పుస్తకాన్ని అనవదించి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి గుజరాతీనే ఎందుకనే అనుమానం వస్తే… సమాధానం ప్రధాని నరేంద్రమోదీ దగ్గర ఆగాల్సిందే. ఎందుకంటే… ఆయన గుజరాతీ మరి. ఆయనను ప్రసన్నం చేసుకోవాడానికి విజయసాయి గుజరాతీ అనువాదం వరకూ వెళ్లారని పొలిటికల్ వర్గాలలో సాగుతున్న చర్చ. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పుస్తకాన్ని ఆవిష్కరింపచేస్తామని ఆయన సమయం కోసం ప్రయత్నిస్తున్నానని జాతీయ మీడియాకు చెప్పడం కూడా ఈ వ్యాఖ్యలకి ఊతం ఇస్తోంది.

కాదు కాదంటూనే నరేంద్రమోడీపై అమితమైన భక్తిని చాటడంలో ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డి ముందుంటున్నారు . సాక్షాత్తూ రాజ్యసభలోనే మోదీ కాళ్లు మొక్కిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా ఆయన ఎప్పుడూ విభజన హామీల విషయంలో నరేంద్రమోదీని ఒక్క డిమాండ్ కూడా చేయలేదు. పైగా… విభజన హామీలు నెరవేర్చలేదని… అసెంబ్లీలో చంద్రబాబు విమర్శిస్తే బీజేపీ నేతల కన్నా ముందే ఏపీ సీఎంపై రాజ్యసభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసుల్ని… మోదీ తరపున ఇచ్చారు ఈ విధంగా మోడీ మీద అమితమైన భక్తి చూపిస్తూ ఒకానొక టైంలో జగన్ కి హ్యాండ్ ఇస్తారా అని జగన్ కే అనుమానాలు తెప్పించారు. ఇప్పుడు ఈ పుస్తకంలో అసలు పొలిటికల్ కోణం అనేదే లేదు అని విజయ్ సాయి రెడ్డి తమ పార్టీ వర్గాల వద్ద చెబుతూ ఉన్నట్లు వార్తలు వస్తున్నా ఆ దేవదేవుడి మీద విజయసాయి రెడ్డి కి అమితమైన భక్తి ఉందా అంటే అదీ అనుమానమే ! ఎందుకంటే ఏకంగా శ్రీ వారి నగలు చంద్రబాబు ఇంట్లో కింద ఉన్నాయని సీబీఐ తవ్వితే దొరుకుతాయి అని ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్యాలు ప్రచారం చేసి శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీశారు. ఇదంతా చూస్తుంటే విజయసాయికి శ్రీవారి మీదున్న భక్తి కంటే మోడీ మీదనే అమితమైన భక్తి కనబరుస్తున్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు.