Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
త్వరలోనే కొత్త పార్టీ పెట్టి తమిళ రాజకీయాలను మారుస్తానంటూ కమల్ హాసన్ చేసిన ప్రకటనను ఆ రాష్ట్రంలో కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కమల్ లానే సినిమాల నుంచి రాజకీయాల్లో ప్రవేశించి పార్టీ పెట్టిన డీఎండీకె అధ్యక్షుడు విజయ్ కాంత్..విశ్వనటుడి రాజకీయ అరంగేట్రంపై స్పందించారు. కమల్ హాసన్ వ్యాఖ్యలను, ఆయన వ్యవహార శైలిని విజయ్ కాంత్ తప్పుబట్టారు. ఇప్పుడు అవినీతి గురించి కమల్ హాసన్ తెగ మాట్లాడేస్తున్నారని..మరి ఈ మాటలన్నీ జయలలిత జీవించిఉన్నప్పుడు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అప్పుడు కమల్ కనీసం నోరు కూడా మెదపలేదని విమర్శించారు. ఈ మేరకు విజయ్ కాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. జయ హయాంలో అవినీతి గురించి ధైర్యంగా మాట్లాడింది తానొక్కడినేనన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యంగా ఉండి ఉంటే…అధికార పార్టీ పరిస్థితి మరోలా ఉండేదని, స్టాలిన్ మెతక వైఖరితో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని విజయ్ కాంత్ విమర్శించారు. కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోనన్నారు.