గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్

ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ అతడిని ఈరోజు ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్‌లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్‌ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్‌ ఆస్పత్రికి తరలించగా.. అతడు మరణించినట్లు తెలుస్తోంది. కాగా వికాస్‌ను పట్టుకునే క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం.

ఉత్తరప్రదేశ్‌లో నేర సామ్రాజ్యం నిర్మించుకున్న వికాస్‌ దూబేను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడి అనుచరులు.. పోలీసులపై కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. గత గురువారం జరిగిన కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామంలో ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. ఈ క్రమంలో వికాస్‌ అనుచరుడు దయా శంకర్‌ అగ్నిహోత్రిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా అతడు సంచలన విషయాలు వెల్లడించాడు. పోలీసులు బిక్రూ గ్రామానికి వచ్చే ముందే వికాస్‌కు ఓ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిందని అతడు వెల్లడించాడు. దీంతో అప్రమత్తమైన అతడు‌.. తన అనుచరులకు ఫోన్‌ చేసి 25-30 మంది.. పోలీసులను అడ్డుకునేలా పథకం రచించాడని తెలిపాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇక పోలీసులపై కాల్పులు జరిపిన అనంతరం వికాస్‌ రాష్ట్రం విడిచి పారిపోగా.. అతడి ఆచూకీ చెప్పిన వారికి నగదు బహుమతి ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. అయినప్పటికీ అతడి గురించి ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో రూ. 50 వేల నుంచి 5 లక్షలకు రివార్డును పెంచారు.

ఈ క్రమంలో ఎట్టకేలకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాలి గుడిలో అతడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసులు వికాస్‌ను అరెస్టు చేయగా.. అక్కడికి చేరుకున్న యూపీ పోలీసులు అతడిని ప్రత్యేక వాహనంలో శుక్రవారం ఉదయం కాన్పూర్‌కు తీసుకు వచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఎస్కార్ట్‌లోని వాహనం బోల్తా పడటంతో వికాస్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపారు. ఇక గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో దూబే అనుచరులు కార్తికేయ, ప్రవీణ్‌ అలియాస్‌ బవువా హతమైన విషయం తెలిసిందే.