కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రముఖ సింగర్, వయోలినిస్ట్ బాల భాస్కర్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు నలభై ఏళ్ళు. తన కుటుంబంతో సెప్టెంబరు 25 న దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తూ తిరువనంతపురం శివార్లలో జరిగిన ప్రమాదంలో గాయకుడు బాలభాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ప్రమాదంలో ఆయన రెండేళ్ల కుమార్తె తేజస్వి అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన, వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.
ఆయన కోలుకోవాలని గత వారం రోజులుగా అభిమానులు, కుటుంబసభ్యులు చేసిన ప్రార్థనలు ఫలించకపోవడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాలభాస్కర్ మెదడుకు గాయం కావడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వెన్నుముక దెబ్బతినడంతో శస్త్రచికిత్స సైతం నిర్వహించారు. అయితే, మెదడులో రక్తస్రావం కావడంవల్లే ఆయన మరణించారని వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం భార్య లక్ష్మీ, డ్రైవర్ అర్జున్‌లు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అభిమానుల సందర్శనార్ధం బాలభాస్కర్ భౌతికకాయాన్ని ఆయన విద్యాభ్యాసం చేసిన తిరువనంతపురం కాలేజీకి తరలిస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు.