2017లో టీమిండియా విజయయాత్ర చూసిన తర్వాత మన జట్టుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కోహ్లీ కెప్టెన్సీలో స్వదేశంలో వరుస విజయాలతో దూసుకుపోయిన భారత్… సఫారీజట్టుపైనా ఈ సారి రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. కొత్త పెళ్లికొడుకు నేతృత్వంలో భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలవాలని అందరూ ఆకాంక్షించారు. అయితే కోహ్లీని అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా అప్పుడే భావించకూడదని దక్షిణాఫ్రికా పర్యటనతో అతని సామర్థ్యం ఏంటో తేలిపోతుందని గంగూలీ తో పాటు మాజీలు అనేకమంది అభిప్రాయపడ్డారు. వారి అనుమానాలనే నిజం చేస్తూ తొలి టెస్టులో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. 286 పరుగులకు దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేసినప్పటికీ…ఆ ఘనతను భారత జట్టు నిలుపుకోలేకపోయింది.
ఓపెనర్ మురళీ విజయ్ ఒక పరుగు చేసి ఔటవ్వగా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 16 పరుగులకే వెనుతిరిగాడు. ఆ సమయంలో అత్యంత బాధ్యతాయుతంగా ఆడాల్సిన కెప్టెన్ కోహ్లీ కేవలం ఐదంటే ఐదే పరుగులు చేసి పెవిలియిన్ బాట పట్టి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. కోహ్లీ ఆటతీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విరాట్ పై నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. పెళ్లయిన తర్వాత ఆడుతున్న తొలిమ్యాచ్ కావడంతో పాటు…సఫారీ జట్టుపై భారత్ గెలవాలన్న ఆకాంక్ష కోహ్లీని నెటిజన్లు టార్గెట్ చేయడానికి కారణమయ్యాయి. కోహ్లీపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సెటైర్లు కొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి.
కోహ్లీ ఎలాంటి కండీషన్ లో అయినా పరుగులు సాధిస్తాడు అన్నది ఊహ అని, బ్యాటింగ్ పిచ్ పై 200, పచ్చిక ఉన్న పిచ్ పై 20 కంటే తక్కువ పరుగులు సాధిస్తాడన్నది నిజమని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు.విరాట్ ఐదు పరుగులకే ఔటయ్యాడు. హనీమూన్ లో ఉన్న ఉద్యోగిని విధులకు హాజరవ్వాల్సిందే అంటే ఇలానే అవుతుంది. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాను…నాకు ఇప్పుడిప్పుడే పెళ్లయింది. అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. హనీమూన్ హ్యాంగోవర్ నుంచి బయటపడి తన సహజమైన ఆట ఆడటానికి కోహ్లి ఇంకా 10 నుంచి 15 ఇన్నింగ్స్ తీసుకుంటాడు అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. ఇప్పుడు తెలిసిందా…కోహ్లీ కంటే ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఎందుకు గొప్పవాడో..స్మిత్ ఎలాంటి పిచ్ లపైనైనా ఆడగలడు. కోహ్లీ సొంతగడ్డపైమాత్రమే ఆడగలడని ఒకరు సెటైర్ వేశారు. మోడీజీ…విదేశాల్లో ఎలా రాణించాలో కోహ్లీకి సలహాఇవ్వాలని మరొకరు వ్యంగాస్త్రం సంధించారు.
కోచ్.. దక్షిణాఫ్రికాలో ఎందుకు ఇబ్బందిపడుతున్నావు..?
కోహ్లి..జాతిపిత మహాత్మాగాంధీనే ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు…ఇక నేనెంత..?….అన్నింటిలోకి ఈ సెటైర్ బాగా వైరల్ అవుతోంది.