Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సెలబ్రిటీలు కనిపించే ప్రకటనలకు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. సెలబ్రిటీలు వాడే వస్తువులను ఉపయోగించేందుకు, వారు తినే, తాగే ఆహారపదార్థాలు, పానీయాలు తినేందుకు, తాగేందుకు సామన్యులు తెగ ఆసక్తి చూపిస్తారు. దీన్నే ఆయా ప్రకటనల కంపెనీలు సొమ్ముచేసుకుంటాయి. సెలబ్రిటీల స్థాయిని బట్టి రెమ్యునరేషన్ ఇచ్చి తమ ప్రకటనల్లో నటించేసుకుంటాయి. మన దగ్గర సినిమా నటులు, క్రికెటర్లే ఎక్కువగా ప్రకటనల్లో కనిపిస్తుంటారు. సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న నటీనటులకు, ఫామ్ లో ఉన్న క్రికెటర్లకు ప్రకటనల అవకాశాలు ఎక్కువ. అలా ప్రస్తుతం దేశంలో ఎక్కువ బ్రాండ్ విలువ ఉన్న ఆటగాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇటీవలకాలంలో ఆయన ప్రకటనల ద్వారానే కోట్లు గడిస్తున్నాడు. కోహ్లిని తమ ప్రకటనల్లో నటింపజేసేందుకు వాణిజ్య సంస్థలు పోటీపడుతున్నాయి. అయితే విరాట్ కోహ్లీ మాత్రం కొందరు సినీ నటుల్లా. ఏ ప్రకటనలో పడితే ఆ ప్రకటనలో నటించటం లేదు. ప్రకటనల ఎంపికలో సామాజిక బాధ్యత పాటిస్తున్నాడు.
ఇటీవల ఓ కూల్ డ్రింక్ కంపెనీ ప్రకటనను ఆయన తిరస్కరించటమే ఇందుకు ఉదాహరణ. శ్రీలంక పర్యటన పూర్తిచేసుకుని ఇండియా వచ్చిన దగ్గరనుంచి కోహ్లీ అనేక ప్రకటనల్లో నటిస్తున్నాడు. ఆసీస్ తో వన్డే సిరీస్ కు ఎక్కువ వ్యవధి లేకపోవడంతో నిరంతరాయంగా షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఆ క్రమంలోనే కోహ్లీ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఓ కూల్ డ్రింక్ కంపెనీ ముందుకొచ్చింది. తమ ప్రకటనలో నటించాలని ఆయన్ను కోరింది. అయితే ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే కోహ్లీ కూల్ డ్రింక్ లకు దూరంగా ఉంటాడు. తాను తాగని వాటి గురించి ప్రచారం చేయటం తగదని భావించిన కోహ్లీ ఆ కూల్ డ్రింక్ కంపెనీతో కోట్లరూపాయల ఒప్పందం కుదుర్చుకునేందుకు నిరాకరించాడు. కోట్లరూపాయల ఆఫర్ ను తిరస్కరించిన కోహ్లీపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కోహ్లీ ప్రజల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించారని పలువురు ప్రశంసిస్తున్నారు.