ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ సీజన్ ఐపీఎల్‌లో దాదాపు అన్ని జట్లు ప్రాక్టీస్‌ను షురూ చేశాయి.
ఈ క్రమంలోనే ఆర్సీబీ కఠోర సాధన చేస్తోంది. దీనిలో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లికి చెందిన వీడియోను ఆర్సీబీ ట్వీటర్ అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లి డైవ్ కొట్టి క్యాచ్ పట్టిన వీడియోను పోస్ట్ చేసింది. కాగా, ఆ వీడియోకు క్యాప్షన్‌ను కాస్త భిన్నంగా పెట్టింది. ‘ ఈ సమయంలో చెప్పడానికి ఏమీ లేదు. వదిలేద్దాం’ అని కోహ్లి డైవ్‌ను కొనియాడింది. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కోహ్లి డైవ్ కొట్టిన క్యాచ్.. రెండు రోజుల క్రితం రిషభ్ పంత్ ప్రాక్టీస్ చేస్తుండగా పట్టిన క్యాచ్‌ను పోలి ఉంది. అయితే ఇక్కడ కోహ్లి కుడివైపు డైవ్ కొట్టగా, పంత్ ఎడమ వైపుకు డైవ్ కొట్టి క్యాచ్ పట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పంత్ ఆడుతున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఇటీవల ప్రాక్టీస్ సెషన్‌లో పంత్ డైవ్ కొట్టి క్యాచ్ పట్టాడు.
సాధారణంగా వికెట్ కీపర్లు డైవ్ కొట్టి క్యాచ్‌లు తీసుకుంటూ ఉంటారు. మరి కోహ్లి వికెట్ కీపర్ తరహాలో క్యాచ్ పట్టుకోవడంతో ఆర్సీబీ మురిసిపోతోంది. కోహ్లి ఫీల్డింగ్‌పై మాట్లాడటానికి పదాలే లేవన్నట్లు ఆర్సీబీ నేరుగా పొగడకుండానే పొగిడేస్తోంది. ఈ నెల 19వ తేదీన ఐపీఎల్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది.
ఇదిలా ఉంచితే, తొలి ప్రాక్టీస్ తమదే కావాలని భావించిన సీఎస్‌కే మాత్రం ఈరోజు(శుక్రవారం) నుంచి ప్రాక్టీస్ చేయనుంది. సీఎస్‌కేను కరోనా వెంటాడటంతో ఆ జట్టు ప్రాక్టీస్‌కు ఆటంకం ఏర్పడింది. ఏకంగా 13 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇది మొత్తం టోర్నీనే ఒక్క కుదుపు కుదపగా, తిరిగి అంతా కోలుకోవడంతో బీసీసీఐతో సహా అన్ని ఫ్రాంచైజీలు ఊపిరిపీల్చుకున్నాయి.