అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ట్విట్టర్ ద్వారా నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటున్నాడు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. సెలబ్రిటీలు, అందునా క్రికెటర్లు చాలా మంది ట్విట్టర్ వాడుతున్నప్పటికీ… సెహ్వాగ్ ట్వీట్లకు చాలా ఫాలోయింగ్ ఉంది. ఆయన ట్వీట్లు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. క్రికెట్ తో పాటు రాజకీయాలు, సినిమాలు, సమకాలీన సమస్యలపై సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటారు. తాజాగా… బాలల దినోత్సవం సందర్భంగా సెహ్వాగ్ చేసిన ఐదు ట్వీట్లపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. మన దేశ స్వాతంత్య్రం కోసం చాలామంది దేశభక్తులు అమరులయ్యారు. వారందరినీ అమరవీరులుగా తలచుకుంటూ స్వతంత్ర దినోత్సవం రోజు నివాళులర్పించుకుంటాం. దేశం కోసం అమరులయిన వారంతా యువతీ, యువకులు, అంతకన్నా ఎక్కువ వయసున్న వారే. కానీ తమ పెద్దలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటుంటే..పిల్లలు సైతం చూస్తూ ఊరుకోలేదు. దేశంలోని అనేక ప్రాంతాల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా ఉరిమే ఉత్సాహంతో పోరాటంలోకి దూకారు.
స్కూళ్లల్లో పాఠాలను బహిష్కరించి బ్రిటిషర్లు నియమించిన ఉపాధ్యాయుల చేతిలో చావు దెబ్బలు తిన్నారు. కానీ స్వాతంత్య్రపోరాటం గురించి చెప్పుకునేసందర్భంలో చిన్నారుల త్యాగాలు గురించి ఎప్పుడూ చెప్పుకోం. సెహ్వాగ్ మాత్రం బాలల దినోత్సవం సందర్భంగా అలా దేశం కోసం ప్రాణాలు విడిచిన తొలి బాల అమరవీరుణ్ని అందరికీ పరిచయం చేశారు. ఆ బాలుడి పేరు బాజీ రౌత్. ఒడిశాలోని ధేన్ కనల్ జిల్లా నీలకంఠపూర్ కు చెందిన బాజీ రౌత్ ప్రజామండల్ ఆందోళన్ బాలల వర్గంలో సభ్యుడిగా ఉండేవాడు. బ్రాహ్మణి నది పడవల రక్షకుడిగా పనిచేస్తున్న బాజీ రౌత్ బ్రిటిష్ వారి అక్రమాలపై ఎదురుతిరిగాడు. బ్రిటిష్ వారు అమాయకులను అకారణంగా చంపేస్తున్నారని తెలుసుకున్న బాజీ రౌత్ వారికి వ్యతిరేకంగా పోరాడాడు. ఆ క్రమంలో 1938 అక్టోబరు 11న బ్రిటిష్ వారి బలగాలను బ్రాహ్మణి నది దాటించేందుకు బాజీ రౌత్ నిరాకరించాడు. తమ ఆదేశాలను బేఖాతరు చేసినందుకు కోపోద్రిక్తుడైన బ్రిటిష్ అధికారి ఒకరు బాజీరౌత్ తలమీద తుపాకీ వెనక భాగంతో కొట్టాడు. దీంతో అక్కడే పడిపోయిన బాజీ…. తన ప్రాణం ఉన్నంత వరకు బలగాలను నది దాటనివ్వని హెచ్చరించాడు. కోపోద్రికత్తులైన బ్రిటిష్ సైనికులు బాజీ రౌత్ ను తుపాకీ తో పేల్చి చంపేశారు. బాజీ రౌత్ తో పాటు అతని స్నేహితులు లక్ష్మణ్ మాలిక్ , ఫాగు సాహూ, హృషీ ప్రధాన్, నాటా మాలిక్ లను కూడా బ్రిటిష్ సైనికులు చంపేశారు. ఐదు ట్వీట్లలో బాజీ రౌత్ , అతని స్నేహితులు దేశం కోసం చేసిన త్యాగం గురించి వివరించిన సెహ్వాగ్.. చిన్న వయసులోనే స్వాతంత్య్రం అర్ధం తెలుసుకుని, దేశం కోసం ప్రాణాలిచ్చిన బాజీ రౌత్ ను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. సెహ్వాగ్ ట్వీట్లను దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తున్నారు.