ఏపీలో పోలింగ్ కు కొన్నిరోజుల ముందు జరిగిన వైఎస్ వివేకా హత్యకేసు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య పలు సందేహాలు లేవనెత్తారు. వైఎస్ వివేకా హత్యలో ముగ్గురు కుటుంబ సభ్యుల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నట్టు ఓ పత్రిక పేర్కొందని, అలాంటప్పుడు ఆ ముగ్గురిని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదో సిట్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు కావడంతోనే పోలీసులు వెనుకాడుతున్నారంటూ ఆ పత్రికలో వచ్చిందని, రాజకీయ నేపథ్యం ఉంటే ఏంచేసినా పట్టించుకోరా? దారుణంగా హత్య చేసినా వదిలేస్తారా? అని ఆయన నిలదీశారు. వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో పోలీసులను అడ్డుకుంటున్నది ఎవరో చెప్పాలని సిట్ ను ప్రశ్నించారు. అంతేకాకుండా, వివేకా కుటుంబ సభ్యులను కూడా వర్ల ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీ కుమారుడిలాంటి జగన్ పులివెందుల వచ్చారు కదా, ఆయనేమైనా వివేకా హత్య కేసు గురించి పోలీసు అధికారులను, సిట్ అధికారులను వాకబు చేశారా? అని అడిగారు. ఎవరో అనామకుడు చనిపోతే వదిలేసినట్టుగా ఎందుకు వివేకా హత్యకేసును గాలికి వదిలేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.