కబడ్డీ కూతకు వేళాయె..

vivo pro kabaddi league season 7

కబడ్డీ కూతకు వేళయింది. అభిమానులను అలరించేందుకు సర్వహంగులతో సిద్ధమైంది. ఈనెల 20 నుంచి స్థానిక గచ్చిబౌలీ స్టేడియం వేదికగా ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) ఏడో సీజన్ పోటీలకు తెరలేవనుంది. గత సీజన్ లాగే ఈసారి మొత్తం 11 జట్లు టైటిల్ కోసం కొదమ సింహాల్లా కొట్లాడేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగబోతున్నాయి. ముఖ్యంగా తెలుగు టైటాన్స్ జట్టు ఎలాగైనా టైటిల్ కొట్టాలన్న కసితో కనిపిస్తున్నది. స్టార్‌రైడర్ బాహుబలి సిద్దార్థ్ దేశాయ్ చేరికతో టైటాన్స్ కొత్త రూపు సంతరించుకుంది. గురువారం ట్యాంక్‌బండ్ వేదికగా పీకేఎల్ ఏడో సీజన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. హుస్సేన్ సాగర్‌లోని బుద్ధుని విగ్రహం వేదికగా 25 అడుగుల భారీ కటౌట్‌తో వేడుకలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిద్దార్థ్ దేశాయ్‌తో పాటు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, బెంగళూరు బుల్స్ కెప్టెన్ రోహిత్ కుమార్, అరుణ్, శివ గణేశ్ రెడ్డి, పల్లె మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. డ్యాన్స్ ప్రొగ్రామ్‌తో పాటు కండ్లు మిరుమిట్లు గొలిపే పటాకులతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు వెలుగులు విరజిమ్మాయి. గచ్చిబౌలీలో మ్యాచ్‌లు చూసేందుకు అభిమానుల కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.