విశాఖను బెంగళూరులా అభివృద్ధి చేస్తామన్నా జగన్మోహన్ రెడ్డి

విశాఖను బెంగళూరులా అభివృద్ధి చేస్తామన్నా జగన్మోహన్ రెడ్డి

పదేళ్లలో విశాఖను హైదరాబాద్, బెంగళూరులా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చెందిన నగరం విశాఖ మాత్రమేననని.. అమరావతిలో పెట్టే ఖర్చులో పది శాతం.. విశాఖలో పెడితే… హైదరాబాద్, బెంగళూరులా మారుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ ప్రైవేటు విద్యా సంబంధిత కార్యక్రమంలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి.. రాజధాని అంశాన్ని కూడా ప్రస్తావించారు. విశాఖలో రాజధాని ఉంటే ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు వంటి..నగరాలకు వెళ్లకుండా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదన్నారు. విశాఖలో మౌలిక వసతులన్నీ ఉన్నాయని గుర్తు చేశారు.

అమరావతి అభివృద్ధి కూడా కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.1.09 లక్షల కోట్లు కావాలని.. కీలక మౌలిక సదుపాయాలకు ఎకరాకు రూ.2 కోట్లు అవుతుందని లెక్క చెప్పారు. ఇంత ఖర్చుతో అమరావతిలో రాజధాని నిర్మాణం కష్టమన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని గుర్తు చేశారు. నిధుల కొరత వల్లే రాజధాని వికేంద్రీకరణ నిర్ణయమన్నారు. తాను ఎవర్నీ తప్పుదోవ పట్టించాలనుకోవడం లేదని జపాన్‌, సింగపూర్‌ నగరాలను సృష్టించేంత నిధులు మన దగ్గర లేవన్నారు.

నేను ఎంత చేయగలుగుతానో ఆ వాస్తవాలు మాత్రమే చెప్పానని చెప్పుకొచ్చారు. నిధులు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. ఖర్చు ఎక్కువ … నిధులు లేవు అనే వాదననే… జగన్ వినిపిస్తున్నారు. అయితే.. బెంగళూరు, హైదరాబాద్ అంత పెద్ద నగరాలు అయింది.. ప్రైవేటు పెట్టుబడులతోనే అన్న వాదనను జగన్ విస్మరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖలో పెట్టుబడులను ఆకర్షించడానికి… ఎలాంటి ప్రయత్నం చేయకపోగా… ఆదాని డేటా సెంటర్, లూలూ కన్వెన్షన్ సెంటర్ సహా.. అనేక ఐటీ కంపెనీలను.. వెళ్లగొట్టారు. ఇలా చేసి.. అక్కడ సెక్రటేరియట్ పెట్టి.. హైదరాబాద్, బెంగళూరులా.. విశాఖను చేస్తామని.. జగన్ చెప్పుకొస్తూండటం.. చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.