ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో ఎల్జీ పాలీమర్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి నుంచి ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిప్రమాదం కారణంగా కంపెనీ నుంచి పెద్ద ఎత్తున విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో ఈ కంపెనీ చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ గ్యాస్ కారణంగా, ప్రజలు కళ్ళు మంటలు, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
అయితే విషవాయువులు 3 కిలోమీటర్ల మేర విస్తరించాయి. ప్రస్తుతం పోలీసులు, అగ్నిప్రమాద సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గ్యాస్ లీకేజీ కంట్రోల్ కావడానికి మరో గంట సమయం పడుతుందని అంటున్నారు. ఈ కంపెనీకి సమీపంలో ఉన్న వెంకటాపురం గ్రామం పెద్ద ఎత్తున ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా సౌత్ కొరియాకు చెందిన ఈ కంపెనీని లాక్ డౌన్ తర్వాత తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజ్ ఎలా జరిగింది. ఎందుకు జరిగింది అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం గ్యాస్ తీవ్రతను తగ్గించేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తుంది. పిల్లలు, మహిళలు, వృద్దులు ఎక్కువగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారంతో ఇప్పటికి నలుగురు మరణించినట్టు తెలుస్తోంది. అలాగే.. పాలిమర్స్ లోని గ్యాస్ ఉన్న ట్యాంక్ పేలిపోవడంతో గ్యాస్ ఒక్కసారిగా బయటకు లీక్ అయ్యింది. లీకైన గ్యాస్ ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాల్లోకి వ్యాపించింది. ఈ గ్యాస్ కారణంగా ఇప్పటికే 2000 మంది వరకు స్పృహతప్పి పడిపోయినట్టు సమాచారం. ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఇంకా చాలామంది ఇళ్లలోనే ఉండిపోయారని, వారంతా ఎలా ఉన్నారు అనే విషయం తెలియడం లేదని, అసలు బతికున్నారా లేదా అన్నది అనుమానమే అని స్థానికులు చెప్తున్నారు.
ఇప్పటికే ఎనిమిది మంది మరణించినట్టు సమాచారం. ఇక మూగజీవాల పరిస్థితి కూడా దారుణంగా ఉన్నది ఇప్పటికే అనేక మూగ జీవాలు ఊపిరాడక మరణించాయి. పక్షులు కూడా మరణించాయి అంటే ఈ గ్యాస్ తీవ్రత ఏ స్తాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దాదాపుగా 50వేలమందిపై ఈ గ్యాస్ ప్రభావం ఉండి ఉంటుందని అంటున్నారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని, రెస్క్యూ టీమ్ గ్యాస్ ను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఏ వాహనం అందుబాటులో ఉంటె ఆ వాహనంలో ప్రజలను తరలిస్తున్నట్లు సమాచారం అందుతుంది.