తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ ఈ కేసు మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు విచారణకు హాజరు కావాల్సిందిగా అప్పటి టీటీడీపీ, ప్రస్తుత కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డికి ఈ నెల 1న నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా ఈడీ ఎదుట హాజరవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో తన ఇద్దరు కుమారులతో కలిసి నరేందర్‌రెడ్డి నిన్న ఈడీ ఎదుట హాజరయ్యారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు ఈదీ అధికారులు. గతంలో టీడీపీలో ఉన్న నరేందర్‌రెడ్డి ఆ తరువాత రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరారు. ఆయన టీడీపీలో ఉన్న సమయంలో ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే నరేందర్‌రెడ్డి గెలుపు కోసం రేవంత్‌రెడ్డి నామినెటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా అప్పట్లో పట్టుబడ్డారు.
ఈ నేథ్యంలోనే ఓటుకు నోటు కేసులో రూ. 50 లక్షలపై ఈడీ నరేందర్‌రెడ్డిని వివరణ కోరింది. ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న రూ.4.50 కోట్ల గురించి ఆరా తీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతిమంగా లబ్ధి చేకూరేది మీకే కాబట్టి మీ ప్రమేయం లేకుండా అంత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారే అవకాశం లేదనే కోణంలో అని ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితునిగా పరిగణిస్తున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని, అతని అనుచరుడు ఉదయ్‌సింహను కూడా విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. 18న రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహలు విచారణకు హాజరుకానున్నారు.