Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత క్రికెట్ లో ఇప్పుడు కోహ్లీ శకం నడుస్తోంది. ఆటగాడిగా, కెప్టెన్ గా కోహ్లీ అద్వితీయ ప్రతిభతో దూసుకుపోతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. కోహ్లీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు సహచరులు, కోచ్ మాత్రమే కాకుండా మాజీ క్రికెటర్లు కూడా విరాట్ ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రస్తుతం భారత్, శ్రీలంక టెస్టుకు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్… కోహ్లీ ఆటతీరును, కెప్టెన్ గా అతని నిర్ణయాలను అద్భతమని పొగుడుతున్నాడు. తాను భారత కెప్టెన్ కు వీరాభిమానిని అని కూడా లక్ష్మణ్ చెప్పాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ… పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, భారత కెప్టెన్ కోహ్లీల్లో ఎవరు బెటర్ అని ఓ టీవీ చానల్ ప్యానల్ అడిగిన ప్రశ్నకు లక్ష్మణ్ ఇచ్చిన సమాధానం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.
దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్, పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్, భారత కెప్టెన్ కోహ్లీల్లో ఎవరు బెస్ట్ అని మాజీ క్రికెటర్లు అయిన మాథ్యూ హేడెన్, అర్నాల్డ్, వీవీఎస్ లక్ష్మణ్ లను టీవీ చానల్ ప్యానల్ ప్రశ్నించింది. హేడెన్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ పేరుచెప్పాడు. ఆర్నాల్డ్ సర్ఫరాజ్ అహ్మద్ పేరు చెప్పాడు. దీంతో లక్ష్మణ్ ఎవరి పేరు చెబుతాడో అని అంతా ఆసక్తిగా చూస్తుండగా… ఆశ్చర్య కరంగా ఆయన సర్ఫరాజ్ బెటర్ కెప్టెన్ అని చెప్పాడు. దానిపై ఆయన వివరణ ఇచ్చాడు. కీలకమైన చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఓడించి సర్ఫరాజ్ పాకిస్థాన్ ను విజేతగా నిలిపాడని, ఆ విజయాన్ని మించినది ఉంటుందని తాను భావించడం లేదని లక్ష్మణ్ విశ్లేషించాడు. అలాగే కోహ్లీ కంటే సర్ఫరాజ్ సక్సెస్ రేటు బాగుందని, అందుకే తాను సర్ఫరాజ్ వైపు మొగ్గుచూపానని తెలిపాడు.
అయితే కోహ్లీకి తాను వీరాభిమానినని, ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని లక్ష్మణ్ చెప్పాడు. కెప్టెన్ గా కోహ్లీ వ్యక్తిగత రికార్డుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని, జట్టు గెలుపు కోసం ఏ విధంగా బ్యాటింగ్ చేయాలన్నదిశగానే ఆలోచిస్తాడని, అలాగే ఆడతాడని వివరించాడు. కోహ్లీ బ్యాటింగ్ సగటు అన్ని ఫార్మాట్లలో 50పైగా ఉండడానికి ఇదే కారణమన్నాడు. కెప్టెన్సీని కోహ్లీ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాడని, కెప్టెన్సీ స్వీకరించిన తరువాతే..అతని బ్యాటింగ్ సగటు పెరిగిందని, అదే అతని ప్రత్యేకతని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.