సమయానికి వర్షాలు కురువక తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న తమిళనాడు రాజధాని చెన్నైకి ఊరట లభించింది. వేలూరు జిల్లాలోని జోలార్‌పట్టై ప్రాంతం నుంచి బయలుదేరిన నీటి రైలు శుక్రవారం చెన్నైకి చేరుకుంది. మొత్తం 50 వ్యాగన్లు కలిగిన ఈ రైలు 25 లక్షల లీటర్ల నీటిని తీసుకొని విల్లివాకంలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి చేరుకుంది. ఈ రైలు నుంచి నీటిని ట్రీట్మెంట్ ప్లాంట్‌కు ప్రత్యేక పైపుల ద్వారా తరలిస్తారు. ట్రీట్మెంట్ ప్లాంట్‌లోకి నీటిని తరలించాక అక్కడి నుంచి ప్రజలకు సరఫరా చేస్తారు. చెన్నైలో సమృద్ధిగా వర్షాలు కురిసి రిజర్వాయర్లు నిండే వరకు దాదాపు ఆరు నెలలపాటు ఈ ఏర్పాట్లు కొనసాగనున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయానికి రాకపోవడంతో చెన్నైకి నీటిని సరఫరా చేసే నాలుగు రిజర్వాయర్లు ఎండిపోయాయి. దీంతో గత ఐదు నెలలుగా చెన్నై తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో చొరవ తీసుకున్న సీఎం పళనిస్వామి నీటి సరఫరా కోసం సహకరించాలని రైల్వే శాఖను కోరారు. అంతేగాక నీటి సరఫరా కోసం నిధులను కేటాయించారు. నీటి రైలు విల్లివాకంకు చేరుకోగానే మంత్రులు స్వాగతం పలికారు. అయితే ఈ రైలుకు స్వాగతం పలుకడానికి మంత్రులు ఆలస్యంగా వచ్చారు. అంతేగాక రైలుతో ఫొటోలు దిగుతూ సమయం వృథా చేశారు. దీంతో నీటి పంపిణీ ఆలస్యమైంది.