తెలంగాణ భగ్గుమంటోంది. గడిచిన పదేళ్లలో లేనంతగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచే వడగాలులు తీవ్రస్థాయిలో వీస్తున్నాయి. ఉదయం 9 దాటితే బయటకు వచ్చేందుకు జనం బెంబేలెత్తుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వేడి ప్రారంభమై మధ్యాహ్నం 12 తరువాత బయటకు రాలేనంత తీవ్రమవుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఆదివారం రోజున 9 జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ జిల్లాల్లోని 34 మండలాల్లో రికార్డుస్థాయిలో వడగాలులు నమోదయ్యాయి.
ఈ ఏడాది తీవ్రమైన వేడితో ఉమ్మడి నల్గొండ జిల్లా కుదేలవుతోంది. నల్గొండ జిల్లాలో ఆదివారం రోజున 10 మండలాల్లో, 8 సూర్యాపేట, 3 కొత్తగూడెం, జనగామ, గద్వాల, ఖమ్మం, మంచిర్యాల, సిద్దిపేట, యాదాద్రి రెండు మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. ఖమ్మం నగరంలోనూ 5 రోజులుగా సాధారణం కన్నా 5 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 3 రోజులుగా వడగాలులు వీస్తున్నాయి. రోజువారీ సగటు ఉష్ణోగ్రత 32- 33 డిగ్రీలకు, రాత్రి ఉష్ణోగ్రత 20.6- 21.1 డిగ్రీలకు పెరిగాయి.