రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఓవైపు ఎండ వేడిమి, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఇలా వేసవి తాపానికి విలవిలలాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వికారాబాద్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వర్షాలు కురిసే జిల్లాల్లో చెట్లు పడిపోవడం, రవాణా వ్యవస్థ స్తంభించడం, విద్యుత్ స్తంభాలు, లోతట్టు ప్రాంతాల్లో వరద చేరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.