తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం పూట ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే జంకే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మంగళవారం రోజున ఉష్ణోగ్రతలు మరింత అధికమయ్యాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు మంగళవారం రోజున ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. తలమడుగు, జైనథ్ మండలాల్లో గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీలు నమోదయినట్లు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు. రానున్న 2 రోజులు కూడా సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ వాతావరణ శాఖ ‘ఆరెంజ్’ హెచ్చరికలను జారీ చేసింది. ఎండలో పనిచేసే వారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు