స్వదేశంలో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి టీమిండియా పర్యటనకు వెస్టిండీస్ బయలు దేరింది. కీరన్ పొలార్డ్ నేతృత్వంలోని విండీస్ జట్టు మంగళవారం రాత్రి భారత్‌కు చేరుకోనుంది. అనంతరం అహ్మదాబాద్‌లో 3 రోజుల పాటు క్వారంటైన్లో విండీస్ జట్టు గడపనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్వదేశంలో టీమిండియాను ఓడించిడం అంత సులువు కాదని, అయితే ప్రస్తుత కరీబియన్ జట్టుకు భారత్‌ను ఓడించే సత్తా ఉందని హోల్డర్ తెలిపాడు.
“టీమిండియాతో సిరీస్ అతి పెద్ద సిరీస్‌గా భావిస్తున్నాను. ప్రపంచంలోనే భారత్ అత్యుత్తమ ఆల్‌రౌండ్ క్రికెట్ జట్టు. వాళ్ల గడ్డపై వారిని ఓడించడం అంత సులభం కాదు. గత రెండేళ్లుగా టీమిండియా స్వదేశంలో అధ్బుతంగా రాణిస్తుంది. కానీ ప్రస్తుత వెస్టిండీస్ జట్టుకు భారత్‌ను ఓడించే సత్తా ఉంది. గత ఏడాది స్వదేశంలో ఐర్లాండ్ చేతిలో ఓటమి తర్వాత మా జట్టు నిరాశకు గురైంది. ఇంగ్లండ్‌పై మా జట్టు బౌన్స్‌బ్యాక్ చేసి అద్భుతమైన విజయం సాధించింది. అదే విధంగా మా డ్రెసింగ్ రూమ్‌లో కూడా ఏటువంటి విభేదాలు లేవు” అని హోల్డర్ పేర్కొన్నాడు. ఇక భారత పర్యటనలో భాగంగా విండీస్ జట్టు మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇక ఆహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది.