సమాజం మనకు చాలా ఇచ్చింది.. మనం ఎంతోకొంత ఆసమాజంకి తిరిగి ఇవ్వాలి’ అని ఆలోచిస్తుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అందుకే, తన సంపాదనలో కొంత మొత్తాన్ని సామాజిక సేవకు వినియోగిస్తున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ ఏర్పాటుచేసి పేద పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద పిల్లలను చదివిస్తున్నారు. ఈ ఫౌండేషన్ బాధ్యతలను మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ చూసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు మహేష్-నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార సైతం తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తోంది.
PMJ జువెల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సితార.. మీ ఫస్ట్ పారితోషకం ఎవరికి ఇచ్చారని మీడియా అడిగితే.. ఛారిటీకి అని సమాధానం ఇచ్చారు. ఇక ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా పేద ఆడపిల్లలకు సైకిళ్లు విరాళంగా అందజేశారు. మహేష్ ఫౌండేషన్ ద్వారా చదువుకుంటున్న ఆడపిల్లలు అందరికీ కొత్త సైకిళ్లు ఇచ్చారు. వారి మధ్యలో కేక్ కట్ చేసి తన పుట్టనరోజును జరుపుకున్నారు. ఆ ఆడపిల్లలతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఫౌండేషన్‌కు మహేష్ బాబు వచ్చి చాలా రోజులు అవుతుందని.. ఈరోజు సితార వద్దకే వచ్చి ఆమె పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని బాలికలు చెప్పారు.
పేద పిల్లలతో కలిసి సితార పుట్టినరోజును జరుపుకోవడం, వారికి సైకిళ్లు అందజేసిన విజువల్స్‌ను మహేష్ బాబు ఫౌండేషన్ ట్వీట్ చేసింది. తండ్రి లాగే సితార మనసు కూడా వెన్న అని పొగుడుతున్నారు. అలాగే, ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇన్నాళ్లూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, నాన్న యాడ్స్ ద్వారా అభిమానులను అలరించిన సితార.. ఇప్పుడు తొలిసారి సోలోగా ఒక కమర్షియల్ యాడ్‌లో నటించిన విషయం తెలిసిందే. PMJ జెవెల్స్ అనే జ్యుయలరీ బ్రాండ్ కోసం సితార చేసిన కమర్షియల్ యాడ్ న్యూయార్క్‌లోని టైమ్స్ స్వ్కేర్ వద్ద ప్రదర్శించారు. ఒక 11 ఏళ్ల అమ్మాయికి ఇదొక ఘనత. ఇక ఈ కమర్షియల్ యాడ్ చేయడం ద్వారా తనకు వచ్చిన సుమారు కోటి రూపాయల పారితోషికాన్ని ఆమె చారిటీకి విరాళంగా ఇచ్చేసింది. కాగా, సితారకు నటనపై ఆసక్తి ఉన్నట్టు ఆమె తల్లి నమ్రత ఇటీవల ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. ప్రస్తుతానికి ఆమె చదువుకుంటోందని.. ఒకవేళ నటనపై ఆసక్తి చూపితే తాను కానీ, మహేష్ బాబు కానీ అడ్డు చెప్పమని స్పష్టం చేశారు