నిద్రపోయే ముందు ఇలా చేయొద్దు

నిద్రపోయే ముందు ఇలా చేయొద్దు

ఆహారం తినే విషయం చెడు అలవాట్లను తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే మనిషి జీవితకాలంపై ఆహార అలవాట్లు తీవ్ర ప్రభావితం చూపిస్తుంటాయి. మంచి అలవాట్లు లేనప్పుడు మనిషి నియమబద్ధంగా జీవించలేడు. ఎంతగా ప్రయత్నించినా ఆనందంగా ఉండలేడు. అందుకే మంచి అలవాట్లను పక్కవారిని చూసైనా నేర్చుకోవాలి.. చెడు అలవాట్లను చూసి మరిచిపోవాలని పెద్దలు హితబోధ చేస్తుంటారు. ఎందుకంటే మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంటాయి. ఆహారం తినే విషయంలోనూ మంచి, చెడు అలవాట్లు ఉంటాయి. అయితే బిజీ లైఫ్‌లో వాటిని మనం సరిగ్గా పట్టించుకోవడం లేదు. అందుకే మనిషి జీవితకాలం నానాటికీ తగ్గిపోతోంది. అయితే ఈ ఆర్టికల్ ద్వారా ఆహారం తినే విషయంలో ఏవి మంచి అలవాట్లో, ఏవి చెడ్డ అలవాట్లో తెలుసుకుందాం.

మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా సమయానికి తినాలని చాలామంది సలహా ఇస్తుంటారు. ఎందుకంటే ఆహారం, నిద్ర అనేవి సమయానికి అనుగుణం లేకపోతే భవిష్యత్‌లో ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఈ రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. అందుకే చాలా మంది ఆహారం తీసుకునే విషయంలో డైటింగ్ ఫాలో అవుతుంటారు. అంటే కొంచెం కొంచెం ఆహారం మాత్రం తీసుకుంటూ ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా సమయానికి నిద్రపోతుంటారు. మంచి డైటింగ్ అలవాటు మీ శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంతో పాటు వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటి కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడంలో మీకు సహాయపడుతుంది. దీంతో పాటు డైటింగ్ అనేది రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండటానికి, మీ మూడ్‌ని క్రమబద్ధీకరించడానికి, మీరు అందంగా కనిపించడంలో సహాయపడుతుంది.

సెరోటోనిన్ అంటే శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్. మనం ఎక్కువగా భోజనం చేసిన సమయంలో శరీరంలో క్లోమ గ్రంధి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీని సంకేతాలు మెదడుకు అందగానే సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఎక్కువగా నిద్రకు సంబంధించిన హార్మోన్‌లు. అందుకే కడుపు నిండా భోజనం చేసిన వారికి త్వరగా నిద్ర వస్తుంటుంది. అయితే సెరోటినిన్ నిద్ర రావడానికి సహాయపడినా.. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర పోవడానికి ఈ హార్మోన్ ప్రేరేపించడం మంచిది కాదు. అందువల్ల ఈ హార్మోన్ ఎక్కువగా లభించే ఆహారాలు తీసుకోరాదు. సరైన మోతాదులో సెరోటోనిన్ లభించే ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. దీని కోసం వోట్స్, గింజలు వంటి ఆహారాలను తీసుకోండి. వీటిలో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడే అమైనో ఆమ్లం అన్నమాట.

ఆహారం తినడం అనేది మన శరీరానికి శక్తిని అందిస్తుంది. కాబట్టి రాత్రి భోజనానికి, నిద్రవేళకు మధ్య మూడు గంటల గ్యాప్ ఉండాలి. అయితే మనిషి చేసే పనులు, వారి అలవాట్ల కారణంగా ఈ గ్యాప్ ఉండటం లేదు. కానీ మూడు గంటల ఈ గ్యాప్ అనేది మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో మేలు చేస్తుందనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. డైటింగ్ అలవాటు రాత్రిపూట సుఖమైన నిద్రను ప్రసాదిస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ రెండు జీవన ప్రక్రియలు ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా ముడిపడి ఉంటాయి. ఒకదానిలో అంతరాయం మరొకదానిపై ప్రభావం పడుతుంది. అందువల్ల నాణ్యమైన నిద్రకు మంచి ఆహారం చాలా అవసరం. మీరు ఏమి తింటారు, ఎప్పుడు తింటారు అని గమనించడం చాలా ముఖ్యం. ఆహారపు అలవాట్లు అనేవి ఒక వ్యక్తి పొందే నిద్ర నాణ్యతను నిర్ణయించడానికి ప్రధానపాత్ర పోషిస్తాయి. మీకు ఇష్టంగా ఉండే ఆహారాన్ని రాత్రిపూట చాలా ఆలస్యంగా తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ స్థాయిలు పెరగడం లేదా అధిక శక్తికి దారి తీయవచ్చు.

అల్పాహారం పగటిపూట అత్యంత ముఖ్యమైన భోజనం. అయితే రాత్రిపూట తీసుకునే భోజనం కూడా శరీరానికి ప్రధానమైనదే. పగలు ఎక్కువ తినాలి.. రాత్రిళ్లు తక్కువగా తినాలి.. ఇది తరచుగా వైద్యులు చెప్పే మాట. ఎందుకంటే పగటి భోజనం మనం చేసే పనిపై ప్రభావం చూపుతుంది. రాత్రి భోజనం నిద్రవేళకు దగ్గరగా ఉంటుంది. అందువల్ల రాత్రిళ్లు తక్కువగా తినాలనే విషయాన్ని మరిచిపోకండి. అధిక ఫైబర్, అధిక కార్బోహైడ్రేట్లు, అధిక ప్రోటీన్‌లు లభించే ఆహారాలను మితంగానే తీసుకోవాలి. సుఖమైన రాత్రి నిద్ర కోసం బీన్స్, క్యాబేజీ, ఉల్లిపాయలు, బ్రౌన్ రైస్, బర్నింగ్ వెజిటబుల్స్ (బార్బీక్యూ) వంటి ఆహారాలను ప్రయత్నించండి. ఏ రకమైన ఆహార పదార్థాన్ని అయినా అతిగా తినడాన్ని నివారించడం మంచిది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మీరు తీసుకునే ఆహారంలో అధిక చక్కెర, అధిక కొవ్వు పదార్ధాలు ఖచ్చితంగా ఉండకూడదు.

పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లో కాఫీ తాగడం మంచిది కాదు. ఎందుకంటే కాఫీ ఉండే కెఫీన్ నిద్రను చెడగొడుతుంది. అందుకే పడుకునే ముందు దానిని నివారించాలి. నిద్రకు ముందు కాఫీ, టీలు వంటివి తీసుకోవడం వల్ల మన కేంద్రీనాడీ వ్యవస్థపై అధిక ప్రభావం చూపి నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది. అదేవిధంగా విపరీతమైన తలనొప్పి, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి. మరోవైపు ఆల్కహాల్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. ఇది నిద్ర విధానంలో ఆటంకాలు కలగజేస్తుంది. అదేవిధంగా రాత్రిపూట నిద్రవేళ సమయంలో కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీమ్‌లు వంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ముఖ్యంగా ఐస్‌క్రీమ్‌లు, కుకీలు, చాక్లెట్‌లు వంటి ఆహారాలలో ఫైబర్ తక్కువగా, చక్కెర ఎక్కువగా ఉండటం వలన అవి నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. ఇది ఎంత మాత్రం మంచి అలవాటు కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.