వాట్సాప్ గ్రూపుల్లో అభ్యంతరకర కంటెంట్ పోస్టులపై గ్రూపు అడ్మిన్ బాధ్యత వహించడంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి పోస్టులకు అడ్మిన్ బాధ్యులు కాదంటూ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ తన తీర్పును వెలువరించారు.అయితే, మార్చి 2020లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన కేసు విచారణ జరిగింది.
ఈ కేసులో పిటిషనర్ ‘ఫ్రెండ్స్’ అనే వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. ఈ గ్రూపులో అతడితో పాటు మరో ఇద్దరు అడ్మిన్లు ఉండగా.. వారిలో ఒకరు గ్రూపులో అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 బి, పోక్సో చట్టంలోని సెక్షన్ 13, 14, 15 ఆధారంగా గ్రూప్ అడ్మిన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పిటిషనర్ గ్రూపును క్రియేట్ చేసినప్పటి నుంచి ఈ కేసులో ఏ2గా ఉన్నాడు.
ఈ పోస్టు విషయంలో తనకు ప్రమేయం లేదంటూ అతను కోర్టును ఆశ్రయించాడు.కాగా, ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా హైకోర్టు.. గ్రూప్‌లోని మెంబర్ పోస్ట్ చేసిన అభ్యంతకర పోస్టులకు గ్రూపు అడ్మిన్ బాధ్యులుకారని పేర్కొంది. అలా వారిని బాధ్యులుగా పరిగణించడం క్రిమినల్ చట్టంలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమంటూ కోర్టు పేర్కొంది.