ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో మనం ఇతరులకు పంపిన సందేశాలు కొన్ని సార్లు డిలీట్ అయినప్పుడు మనం కంగారూ పడుతుంటాం. అయితే, ఇలా డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం కోసం ఎక్కువ శాతం మంది ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో లభించే థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు. ఇలాంటి, వాట్సాప్ డేటా రికవరీ చేసే థర్డ్ పార్టీ యాప్స్‌లలో డబ్ల్యుఏఎమ్ఆర్ అనేది చాలా ఫేమస్. అయితే, ఇప్పుడు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న యూజర్లు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ యాప్‌ని 50 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు.ఈ యాప్ వల్ల మీ డేటా బయటకు వెళ్లే ప్రమాదం ఉన్నట్లు భద్రత నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ యాప్ వినియోగదారుల ఇంటర్నెట్ గోప్యతను దెబ్బతీస్తుంది అని నిపుణులు అన్నారు. వాట్సాప్ నియమ & నిబంధనల ప్రకారం సందేశాలన్నీ ఎన్ క్రిప్ట్ చేయబడతాయి. అయితే, ఈ ఎన్ క్రిప్ట్ చేసిన సందేశాలను ఇతరులు చదవడం అసాధ్యం.
ఈ డబ్ల్యుఏఎమ్ఆర్ అనేది మీరు చాట్ చేసిన మెసేజ్‌లను తన కంపెనీకి చెందిన సర్వర్లలో నిలువ చేసే అవకాశం ఉంది. దీని వల్ల మీ డేటా ఇతరుల చేతికి చిక్కే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కు చెందిన సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ యాప్ విభిన్న సెట్టింగ్స్ అనుమతి అవసరం కనుక, ఈ యాప్ సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. వినియోగదారులు గ్యాలరీ, నెట్ వర్క్, నోటిఫికేషన్ సెట్టింగ్స్ కి అనుమతి ఇవ్వడం వల్ల డేటా లీకేజీ ప్రమాదం జరగనున్నట్లు పేర్కొన్నారు.