ఆరోగ్యం గురించి బోలెడు విషయాలు తెలుసు అని మనలో ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకే ఎవరన్నా ఏదన్నా సమస్యని చెప్పగానే ఓ వైద్యుడిలాగా మారిపోయి తెగ సలహాలు ఇచ్చేస్తుంటాం. కానీ ఇలాంటి అరకొర నమ్మకాలతోనే మన జీవితాలు పాడైపోతున్నాయని నిపుణులు తలబాదుకుంటున్నారు. అలాంటి ఓ పే…ద్ద నమ్మకమే – గోధుమ రొట్టెలు తినడం చాలా మంచిది అనే మాట!
ఊదరగొట్టేశారు
ఎవరన్నా తమ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధగా ఉంచేందుకు చేసే మొదటి ప్రయత్నం రాత్రివేళల్లో గోధుమ రొట్టెలని తినడం. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు లేదా వయసు మీద పడినవారు ఇప్పుడు రాత్రియితే అన్నం ముట్టుకోకుండా చపాతీలనే తింటున్నారు. ఇదంతా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న మార్పు మాత్రమే. ఈ మార్పు వెనుక ఆరోగ్య కారణాల కంటే వ్యాపార సంస్థలు చేసిన ప్రకటనలే ప్రభావం చూపాయంటున్నారు నిపుణులు.
సమస్యలు ఎక్కువే!
బియ్యంతో పోలిస్తే గోధుమలని అరాయించుకోవడంలో చాలా సమస్యలు ఉంటాయి. Celiac Disease, Wheat Allergy, Gluten Sensitivity వంటి ఇబ్బందులతో మన శరీరం తెగ సతమతం అయిపోతుంది. వీటివల్ల తలనొప్పి దగ్గర్నుంచీ విరేచనాల వరకూ నానారకాల సమస్యలు తలెత్తుతాయి. దురదృష్టవశాత్తూ ఈ సమస్యల వెనుక కారణం గోధుమలతో చేసిన ఆహారం అన్న విషయం చాలామందికి తెలియదు. అసలు 90 శాతానికి పైగా జనానికి, తమకి గోధుమలు పడవు అన్న విషయమే తెలియదట.
ఒకవేళ సరిపడినా!
గోధుమలు ఒకవేళ మన ఒంటికి సరిపడతాయే అనుకుందాం. అప్పుడు కూడా అవేమంత ఆరోగ్యకరం కాదంటున్నారు. గోధుమలలో gluten, gliadin అనే ప్రొటీన్లు ఉంటాయి. గోధుమ బంకగా ఉండటానికి gluten కారణమవుతుంది. ఇది మన పేగులకు అంటుకుని ఓ పట్టాన జీర్ణం కాదట. తరచూ ఇలా గ్లుటెన్తో మన పేగులకి పరీక్ష పెట్టడం వల్ల నిదానంగా వాటి శక్తి క్షీణించిపోతుందని హెచ్చరిస్తున్నారు. దీని వలన జీర్ణశక్తి మందగించడమే కాకుండా, శరీరానికి అవసరమయ్యే పోషకాలను శోషించుకునే గుణాన్ని కూడా పేగులు కోల్పోతాయి. ఇక గోధుమలు ఒక వ్యసనంలా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. వీటిలో ఉన్న gliadin అనే ప్రొటీన్ వల్ల రోజూ గోధుమలని తినాలని శరీరానికి అనిపిస్తూ ఉంటుందట.
షుగర్ కూడా హుళుక్కే!
గోధుమ రొట్టెలని తినడం వల్ల షుగర్ అదుపులో ఉంటుదన్నది ఓ ప్రధానమైన నమ్మకం. కానీ ఇందులో కూడా వాస్తవం లేదంటున్నారు. గోధుమలు తిన్న వెంటనే వాటిలోని చక్కెర ఒక్కసారిగా రక్తంలోకి చేరిపోతుందట. ముఖ్యంగా బ్రెడ్, రిఫైన్డ్ గోధుమలతో మనలోని చక్కెన నిల్వలు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. ఇది డయాబెటిస్కు దారితీస్తుంది. ఆహారం తిన్న తరువాత అందులోని చక్కెర మన రక్తంలోకి చేరుకునే విధానాన్ని కొలిచేందుకు ‘glycemic index’ అంటారు. ఇది బియ్యంతో పోలిస్తే గోధుమ పదార్థాలలో పెద్ద తేడాగా ఏమీ కనిపించదు.
హైబ్రీడు విత్తనాలు – రిఫైన్డ్ పిండి
ఇప్పుడు మనకి లభిస్తున్న గోధుమపిండి మరో ముఖ్య సమస్య. ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందనో, పిండి మెత్తగా ఉంటుందనో… కారణం ఏదైతేనేం, ఇప్పుడంతా హైబ్రీడు గోధుమ విత్తనాలను వాడుతున్నారు. వీటివల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని దెబ్బతీసేలా ఆటోఇమ్యూన్ వ్యాధులు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇక రొట్టెలు రుచిగా, మృదువుగా ఉండేందుకు వీటిని వీలైనంత రిఫైన్ చేస్తున్నారు. ఇలాంటి గోధుమ రొట్టెలు ఎంతవరకు ఆరోగ్యమో ప్రత్యేకించి చెప్పేదేముంది!!!
అదన్నమాట సంగతి! అంచేతా గోధుమ రొట్టెలో గోధుమ రొట్టెలో అని తెగ తపించిపోకుండా… వేరే ప్రత్యామ్నాయాల ద్వారా తగినంత పోషకాలను సాధిస్తూ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోమని సూచిస్తున్నారు. ముతక బియ్యం, తాజా కూరగాయలు, కాలానికి అనుగుణంగా దొరికే పండ్లు తీసుకుంటూ తగినంత వ్యాయామం చేయమన్నది నిపుణులు మాట.
అంజి బాబు (లాయర్)