అమరావతిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోసం క్యాంపు కార్యాలయం నిర్మించాలన్న ప్రతిపాదనపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆయన దేవుడి సొమ్మును స్వాహా చేయబోతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. తాజాగా ఈ విమర్శలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిప్పికొట్టారు. ‘ఈ అబ్బాకొడుకులు ఇద్దరూ రాష్ట్రమంతా దోచి పారేశారు. వీళ్లు నా గురించి మాట్లాడుతున్నారు. దేవుడి సొమ్మును ఒక్క పైసా కూడా ముట్టుకోను. అవసరమైతే నా జేబు నుంచి ఖర్చు చేస్తాను. మేము ఏమీ వాళ్లలాగా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు. మా ముఖ్యమంత్రి, మేము పదేళ్లు కష్టపడ్డాం. ప్రజలకు మేలు చేయాలని వచ్చాం. అందుకే ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. దేవుడి సొమ్ము కాదు ఒక్క రూపాయి సొమ్మును వృథా కూడా కానివ్వబోమని పేర్కొన్నారు. నా ప్రయాణాలకు కూడా స్వామివారి సొమ్ము ఒక్క రూపాయి కూడా వాడనని అన్నారు. అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామనీ, ఈ కారణంగానే అక్కడ కూడా ఓ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని సూచించినట్లు చెప్పారు. అంతేతప్ప ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని తాను కోరలేదన్నారు.