Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటక ఎన్నికల్లో ప్రచారపర్వం నిన్నటితో ముగిసింది. ప్రచారం చివరి రోజున భాజపా పై అవినీతి మరక పడింది. అయితే ముందు నుండి బీజేపీకి ఏమాత్రం మద్దతు పలకని ఏపీ మీడియా అదేమీ విచిత్రమో నిన్నటి నుండి బీజేపీకి వత్తాసు పలకడం మొదలెట్టింది. అన్ని జాతీయ మీడియా చానెళ్ళు, కన్నడ చానెళ్ళు కాంగ్రెస్ గెలుస్తుందని బల్లగుద్ది చెబుతున్నా ఏపీ మీడియా మాత్రం తన స్టాండ్ మార్చుకుని ఒక సేఫాలజిస్ట్ సర్వే అంటూ బీజేపీకి మద్దతు పలికేలా కధనాలు ప్రసారం చేయడం ఇప్పుడు పలు అనుమానాలకి తావిస్తూ తెలుగు రాజకీయ వర్గాల్లో పలు ప్రకంపనలు సృష్టిస్తోంది.
అయితే అసలు ఎల్లో మీడియా అంటూ ప్రత్యర్ధి పార్టీలు ఎదురు దాడి చేస్తే గమ్మున ఉండే సదరు మీడియాలో ఇప్పుడు బీజేపీ-మోడీ అనుకూల వార్తలు ఎందుకా అని ఆలోచిస్తే అక్కడి తెలుగు వారి ఓట్ల గురించి అని కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికయినా ఇట్టే అర్ధమయ్యే అంశం. అయితే తెలుగు వారి ఓట్లు పడాలంటే కన్నడ మీడియా కంటే తెలుగు మీడియా నే సరైన మీడియా అని భావించి సదరు కధనలని బీజేపీ ప్రసారం చేయించిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మొదటి నుండి తెదేపా అనుకూల మీడియా అనుకున్న సదరు న్యూస్ చానెల్స్ ఇప్పుడు తెదేపాకి బద్ద శత్రువులా వ్యవహరిస్తున్న బీజేపీకి మద్దతు పలకడానికి మోడీ-షా ద్వయం ఒత్తిడి చేశారా, లేకా ఏదైనా మ్యాజిక్ ఫిగర్ ని వారికి ఆఫర్ చేసారా అనే అనుమానాలు సైతం ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
అయితే దీనికి ఊతం ఇచ్చేలా నిన్న శ్రీ రాములు స్టింగ్ ఆపరేషన్ బయట పడితే అన్ని కన్నడ చానెల్స్ దాని మీద ఫోకస్ పెడితే కన్నడ ఎన్నికల మీద స్పెషల్ స్టోరీస్ ప్రసారం చేస్తున్న మన తెలుగు మీడియా అసలు దానిని ప్రధాన వార్తగా గుర్తించలేదు. అలాగే నిజానికి మెజారిటీ సర్వేల్లో కాంగ్రెస్‌కే పట్టం కడతారు అన్న విషయం అర్ధం అవుతోంది. కానీ పోల్ మేనేజ్మెంట్లో రాటుదేలిపోయిన అమిత్ షా అండ్ కో అందులోభాగంగా ఎన్నికల ముందు తమకు సానుకూల వాతావరణం ఏర్పడిందనే భావన ఏర్పర్చడానికి చాలా ముందుగానే ప్రణాళికలు వేశారు. దాని ప్రకారం… ఒక్కొక్కటిగా సర్వేలు జనాల్లోకి చొప్పిస్తున్నారు.
కొన్ని ఊరు పేరూ లేని సంస్థలయితే మరికొన్ని పేరు చెప్పుకోవడానికి ఇష్టం లేక లీకులిస్తున్న సంస్థలు, వ్యక్తులు. ఇలా ప్రచారం ముగిసే రోజునుండే బీజేపీ కర్ణాటకను కైవసం చేసుకోనుందని విషయాన్నీ జనాల్లోకి చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పిస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఎటు ఓటు వేయాలో తేల్చుకొని తటస్థ ఓటర్లు, అలాగే తెలుగు సెటిలర్ల ఓట్లని తమ వైపు తిప్పుకోవడం కోసమే ఈ సర్వేల ప్రకటనలు అని విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటకలో తెలుగువాళ్లు బీజేపీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తమ వ్యతిరేకతను బహిరంగంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని మరీ వెళ్లగక్కారు. దీంతో ఇప్పుడు తామే గెలవబోతున్నామని మద్దతివ్వకపోతే మీ అంతు చూస్తామన్నట్లుగా… బెదిరింపుల లాంటి ప్రచారం చేసుకుని వారి ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోందనేది విశ్లేషకుల వాదన నిజానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అమలు చేసింది ఈ వ్యూహన్నే. మోదీషాలా ఈ మైండ్ గేమ్ మొత్తానికి వర్కవుట్ అవుతుందో లేదో ఈ నెల 15 న తేలిపోనుంది.