చంద్ర‌బాబుతో మోడీకి అవ‌స‌ర‌మేంటి?

Why Modi Gives Appointment to Chandrababu?

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌ధానితో భేటీ అయ్యేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించినా… కొన్ని నెల‌ల క్రితం ఆయ‌న‌కు అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు నిరాక‌రించిన మోడీ… ఇప్పుడు మాత్రం స్వ‌యంగా ఆయ‌నే ఎందుకు ఆహ్వానం పంపారు…? మోడీ, బాబు భేటీ కానున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో త‌లెత్తుతున్న‌ సందేహం ఇది. 2014 ఎన్నిక‌ల్లో క‌లిసిపోటీచేసిన‌ప్ప‌టికీ… కేంద్ర‌, రాష్ట్రాల్లో మిత్ర‌పక్షాలుగా ఉంటున్న‌ప్ప‌టికీ… ఏడాది కాలంగా బీజేపీ, టీడీపీ సంబంధాలు అంతంత‌మాత్రంగానే ఉన్న సంగ‌తి అంద‌రికీ అర్ధ‌మ‌వుతూనే ఉంది. ఏ క్ష‌ణ‌మైనా ఈ పొత్తు తెగ‌తెంపుల‌వుతుంద‌ని కూడా అంద‌రూ అనుకున్నారు. ప్ర‌ధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా రాజ‌కీయ ఆశ‌లే ఈ ప‌రిస్థితికి కార‌ణం. ఏపీలో సొంతంగా ఎద‌గాల‌న్న‌ది వారి ల‌క్ష్యం. టీడీపీకి ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గితే తాము బ‌ల‌ప‌డొచ్చ‌ని వారు భావించారు. టీడీపీకి దూరం జ‌రిగి… 2019 ఎన్నిక‌ల నాటికి కొంత బ‌ల‌ప‌డి… ఆ ఎన్నిక‌ల్లో వైసీపీతో క‌లిసి పోటీచేసి… ఆ త‌ర్వాత ఎన్నిక‌ల నాటికి… సొంతంగా బ‌ల‌ప‌డాల‌న్న‌ది మోడీ, షాల వ్యూహం.

ఆ క్ర‌మంలోనే ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న బాధిత ఏపీకి అనేక విష‌యాల్లో మొండిచేయి చూపి చంద్ర‌బాబును ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు మాత్రం త‌న‌కు ఎదుర‌యిన అవ‌మానాల‌ను వ్య‌క్తిగ‌తంగా తీసుకోకుండా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రంతో స‌ఖ్యంగా ఉండేందుకే ప్ర‌య‌త్నించారు. కేంద్రం వైఖ‌రిని, చంద్ర‌బాబు రాజీ ధోర‌ణిని గ‌మ‌నించిన ఏపీ ప్ర‌జ‌లు విష‌యం గ్ర‌హించి… ముఖ్య‌మంత్రికి అండ‌దండ‌గా నిలిచారు. నంద్యాల ఉప ఎన్నిక ఫ‌లితంలో క‌నిపించింది అదే. మూడేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌పై నంద్యాల ఉప ఎన్నిక రిఫ‌రెండం అన్న జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను మోడీ, షాలు కూడా న‌మ్మారు. జ‌గ‌న్ చెప్పిన‌ట్టుగా చంద్ర‌బాబు పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉందని, ఆ వ్య‌తిరేక‌త నంద్యాల‌లో ఓట్ల రూపంలో వ్య‌క్త‌మ‌వుతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు జ‌గ‌న్ తో క‌లిసి న‌డిచేందుకు స‌న్న‌ద్ధమ‌య్యారు. కానీ ఉప ఎన్నిక ఫ‌లితం వారు ఊహించిన దానికి భిన్నంగా వ‌చ్చింది. ఏపీలో టీడీపీకి ప్ర‌జాద‌ర‌ణ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని, అదే స‌మ‌యంలో విభ‌జ‌న హామీల విష‌యంలో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యం వ‌ల్ల బీజేపీపై వ్య‌తిరేక‌త పెరిగింద‌ని మోడీ, షాల‌కు అర్ధ‌మ‌యింది. దీంతో మోడీ, షాలు వెన‌క్కి త‌గ్గి మౌనం వ‌హించారు. ఏపీ రాజ‌కీయాల‌పై సందిగ్ధావస్థ‌లో ప‌డ్డారు.

కొన్నాళ్లకు గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి… మోడీ, షాల ఆశ‌ల‌ను పూర్తిగా ఆవిరి చేశాయి. బీజేపీకి గ‌ట్టి ప‌ట్టు ఉన్న రాష్ట్రంలోనే చ‌చ్చీ చెడీ సాధించిన గెలుపు… మోడీ, షాల‌కు ఒక పాఠం నేర్పింది. దేశం మొత్తంగా సొంతంగా ఎద‌గాల‌న్న క‌ల నేరవేర్చుకోవ‌డం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సాధ్యం కాద‌ని, మిత్ర ప‌క్షాల‌ను క‌లుపుకుని వెళ్తేనే రాజ‌కీయంగా భ‌విష్య‌త్ ఉంటుంద‌ని, ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయ‌డం అనుకున్నంత తేలిక కాద‌ని అర్ధంచేసుకున్నారు. ద‌క్షిణాదిన బ‌ల‌మైన రాష్ట్రంగా ఎదుగుతున్న ఏపీలో మిత్ర‌ప‌క్షం అండ‌లేక‌పోతే పార్టీ ఉనికికే ప్ర‌మాద‌మొస్తుందని గ్ర‌హించి టీడీపీతో మ‌ళ్లీ య‌ధాత‌థ‌స్థితిని కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. చంద్ర‌బాబుకు పిలిచి మ‌రీ మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వ‌డం ఈ ప‌రిణామంలో భాగ‌మే. ఏపీలో టీడీపీ అవ‌స‌రం బీజేపీకి ఉంద‌ని గ్ర‌హించ‌డం వ‌ల్లే మోడీ, షాలు త‌మ వైఖ‌రి మార్చుకున్నారు. ఎప్పుడూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కూడా ఇలాంటి అభిప్రాయ‌మే వెలిబుర్చారు. అవ‌స‌రాన్ని బ‌ట్టే చంద్ర‌బాబుకు మోడీ అపాయింట్ మెంట్ ఇస్తున్నార‌ని ఆరోపించారు. ఏపీ ఎంపీల‌తో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ స‌మావేశం సంద‌ర్భంగా జేసీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోడీ వ్య‌వ‌హార శైలిపై ప‌రోక్ష విమర్శ‌లు చేశారు. పార్ల‌మెంట్ లో ఎంపీల ప‌రిస్థితి చేయి ఎత్త‌మంటే ఎత్తాలి, దించ‌మంటే దించాలి అన్న‌ట్టుగా త‌యార‌యింద‌ని, వారిని క‌రివేపాకులా చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. విశాఖ ప‌ట్ట‌ణం రైల్వే జోన్ విష‌యంలో ఎంపీలు చేసేదేమీ లేద‌ని, దీనిపై స్ప‌ష్టత ఇవ్వాల్సిన బాధ్య‌త ప్ర‌ధాని మోడీపైనే ఉంద‌ని జేసీ వ్యాఖ్యానించారు.