కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా భార్యను చంపిన దుర్మార్గుడు !

wicked-man-who-killed-his-wife-without-even-seeing-the-stomach

హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట కనిపించకుండాపోయిన ఓ గర్భిణి మహిళ పొదల్లో శవమై తేలింది. కట్టుకున్న భర్తే ఆమెను కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని పొదల్లో పడేసినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగల్‌పల్లి‌ గేట్ సమీపంలో ఆదివారం (ఆగస్టు 4) ఉదయం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

మృతురాలిని నేనావత్ సరిత (22)గా గుర్తించారు. శంషాబాద్ పరిధిలోని కందుకూరు మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన సరితకు ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో ఏడాది కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచే సరితను అదనపు కట్నం కోసం ఆమె భర్త రాజు వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమార్తెను అతడే హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు.

గర్భిణి అయిన సరితను ఆమె భర్త రాజు ఆసుపత్రిలో పరీక్షల నిమిత్తం శుక్రవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించకుండాపోయింది. సరిత భర్త కూడా పరారీలో ఉండటంతో అతడే హత్య చేసి పరారై ఉంటాడని భావిస్తున్నారు. కందుకూరు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.