ప్రియుని మోజులో పడిన మహిళ భర్తనే కడతేర్చిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డ పట్టణంలో వెలుగు చూసింది. 10 రోజుల తరువాత ఆమె కొడుకు ఈ దారుణాన్ని బయటపెట్టాడు. పట్టణ పరిధిలోని కరేనహళ్లిలో నివసిస్తున్న నేత కార్మికుడు రాఘవేంద్ర హతుడు కాగా, ఇతని భార్య శైలజ, ప్రియుడు హనుమంతు ముఖ్య నిందితులు. ఈ ఘోరానికి శైలజ తల్లి లక్ష్మిదేవి సహకరించడం గమనార్హం. డిసెంబర్ 27న రాఘవేంద్రను ఇంట్లోనే ఊపిరాడకుండా చేసి చంపారు. మూర్ఛతో మృతిచెందాడని శైలజ అందరికీచెప్పి అంత్యక్రియలు చేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇంతలో అసలు విషయమేమిటో ఆ దంపతుల కొడుకు బంధువులకు చెప్పడంతో గుట్టు రట్టయింది. గార్మెంట్స్ ఫ్యాక్టరీకి వెళ్తున్న శైలజకు అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న హనుమంతు అనే కూలీలో సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి రాఘవేంద్ర భార్యతో గొడవ పడ్డాడు. మరోవైపు హనుమంతు భార్య కూడా శైలజతో గొడవపడి కొట్టింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని నిద్రపోతున్న భర్తను ప్రియుడు, తల్లి సహకారంతో హత్య చేసింది. దొడ్డ గ్రామీణ పోలీసులు శైలజ, హనుమంతు, లక్ష్మిదేవిలను అరెస్టు చేశారు.