కట్టకున్న భర్తను ప్రియుడితో కలసి కడతేర్చిన సంఘటన మండలంలోని చింతలూరు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జంకల అప్పారావు అలియాస్ వరహాలు(37)కు గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన మంగతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. మొదటి నుంచి వీరి వివాహ సంబంధం అంతంత మాత్రంగానే ఉండడంతో తరచూ భార్యభర్తలు గొడవ పడేవారని స్థానికులు తెలిపారు. భర్త మద్యానికి బానిసై నిత్యం భార్యను హింసించడం, భార్య గ్రామానికి చెందిన వరసకు కొడుకు అయ్యే సమీప బంధువు జంకల మణికంఠ (స్వామి)తో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు.
భర్త తాగొచ్చి హింసించడమే కాకుండా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడాన్ని సహించ లేని మంగ భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. పథకం ప్రకారం ప్రియుడితో కలసి బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇంట్లో నిద్రిస్తున్న భర్తను కత్తె, కర్రతో ఇరువురూ కలసి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం ఇంటి వాకిట్లో ఉన్న సందెకాలుపై మృతదేహాన్ని పడేసి ప్రమాదవశాత్తూ మరణించినట్టు చిత్రీకరించేందుకు ప్రయతి్నంచినా మృతుడి శరీరంపై బలమైన గాయాలు ఉండడంతో పథకం పారలేదు. గురువారం మృతుడు, ప్రియుడు కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది.
ఈ గొడవలో ప్రియుడి బంధువులు మృతుడిని చంపేస్తామని హెచ్చరించడంతో వారే తన భర్తను హత్య చేసినట్టు మృతుడి భార్య పోలీసులకు తెలిపింది. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్, ప్రత్తిపాడు సీఐ వై.రాంబాబు, ఎస్సై బి.అజయ్‌బాబు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో సంఘటన స్థలంలో వివరాలను సేకరించారు. పోలీసులు మృతుడి భార్య మంగ, ప్రియుడు మణికంఠలను అదుపులోకి తీసుకొన్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.