నిద్రిస్తున్న భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అజాంపుర కాలనీలో మంగళవారం వెలుగు చూసింది. తాగి వచ్చి వేధిస్తుండడంతో తానే చంపేశానని భార్య చెబుతుండగా, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే చంపేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. అజాంపుర కాలనీలో నివాసముండే అఫ్రోజ్ ఖాన్ కు భార్య ఫర్జానా బేగం, కుమారుడు ఉన్నారు.
ఫర్జానా మొదటి భర్తను వదిలేసి, అఫ్రోజ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. అఫ్రోజ్ ఖాన్ గతంలో ఆటో నడిపే వాడు. కొద్ది రోజుల నుంచి అల్లం, వెల్లుల్లి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, రోజూ మద్యం సేవించి వచ్చి భార్యను వేధిస్తున్నట్లు తెలిసింది. విసిగి పోయిన ఫర్జానా సోమవారం అర్ధరాత్రి సమయంలో భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. సమాచారమందుకున్న పోలీసులు మృతదేహాన్ని మంగళవారం పోస్టుమార్టం కోసం తరలించారు.
ఘటన స్థలాన్ని డీఎస్పీ సోమనాథం, ఎస్‌హెచ్‌వో మధుసూదన్ పరిశీలించారు. రోజు మద్యం సేవించి తనను వేధించడంతోనే హత్యకు పాల్పడినట్లు ఫర్జానా చెబుతోంది. అయి తే, వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడనే కారణంతోనే హత్చ చేసినట్లు అఫ్రోజ్ బంధువులు ఆరోపిస్తున్నారు. భార్య ఒక్కరే హత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికి హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని డీఎస్పీ సోమనాథం తెలిపారు.