కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపేసిందో భార్య

కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపేసిందో భార్య

కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపేసిందో భార్య. నిత్యం వేధింపులు భరించలేక దారుణ నిర్ణయం తీసుకుంది. రోజూ తాగొచ్చి కొడుతుండడంతో భరించలేక కళ్లలో కారంకొట్టి అమానుషంగా హతమార్చింది. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగింది. మండలంలోని ఓత్కులపల్లికి చెందిన సారయ్య కి మల్లీశ్వరితో కొన్నేళ్ల కిందట వివాహమైంది. తాగుడుకు బానిసైన సారయ్య నిత్యం తాగొచ్చి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆలుమగల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి.

బుధవారం రాత్రి కూడా ఫుల్లుగా మద్యం సేవించిన సారయ్య ఇంటికొచ్చి భార్య మల్లీశ్వరితో గొడవపడ్డాడు. రోజూ భర్త వేధింపులు భరించలేకపోయిన ఆమె దారుణ నిర్ణయం తీసుకుంది. భర్త కళ్లలో కారం కొట్టి కిందపడిపోగానే కర్రతో తలపై బలంగా కొట్టింది. తీవ్రగాయాలు కావడంతో భర్త సారయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న భార్య అక్కడి నుంచి పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.