తమిళ రాజకీయాల్ని మార్చేస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో హాట్ టాపిక్ గా మారిన విశ్వ నాయకుడు కమల్ హాసన్ కి అప్పుడే ఓ పరీక్ష ఎదురైంది. ఓ ప్రశ్నకి జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. కమల్ నోటినుంచి రాజకీయం ప్రస్తావన వస్తున్నప్పటినుంచి ఆయన వెంట ఎక్కువగా కనిపిస్తోంది చిన్న కూతురు అక్షర. కమల్ చేయబోయే రాజకీయ ప్రయాణంలో ఈమె పాత్ర ఏమిటి అన్న దానిపై అప్పుడే తమిళనాట చర్చ మొదలైంది. పెద్దమ్మాయి శృతి హాయిగా సినిమాలు చేసుకుంటోంది. సినిమాల్లో ఆమె నా వారసురాలు కాదని ఆర్కే ఓపెన్ హార్ట్ లో బోల్డ్ స్టేట్ మెంట్ I చేశారు కమల్. అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాతే సీన్ లోకి అక్షర వచ్చింది. ఆమె గురించి అడిగినప్పుడు కమల్ సన్నిహితులు భలే సమాధానం ఇస్తున్నారు. అక్షరకి సామాజిక స్పృహ ఎక్కువని, అందుకే ఆమె కమల్ రాజకీయ ప్రస్థానానికి అవసరమైన సేవలు అందిస్తున్నారని చెబుతున్నారు.
ఆ సమాధానాలే కొత్త సందేహాలకు తావు ఇస్తున్నాయి. సినిమాల్లో అంతగా కలిసిరాని అక్షరకు కమల్ రాజకీయాల్లో దారి చూపిస్తారా అని ?. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని చెబుతూ కొత్త బాటలో నడుస్తానని చెప్తున్న కమల్ కూతురు గురించి ఇప్పుడు ఏదో ఒక వివరణ ఇచ్చినా, ఇవ్వకపోయినా జనం నమ్మడానికి అంతంత మాత్రం అవకాశమే. ఎందుకంటే ఏ రాజకీయ కుటుంబంలో అయినా ఇలాగే చెబుతారు. అప్పుడెప్పుడో సంగతులు ఎందుకు … ఈ మధ్యే రెండు తెలుగు రాష్ట్రాల్లో కెసిఆర్ సంతానం కేటీర్, కవిత ఎలా రాజకీయాల్లోకి వచ్చారో చూసాం. తన పిల్లలు ఎక్కడో అమెరికాలో వున్నారని చెప్పిన కెసిఆర్ ఆ తర్వాత వాళ్ళని రంగంలోకి దింపేశారు.ఇక చంద్రబాబు కూడా లోకేష్ విషయంలో అలాగే చేశారు. రొటీన్ రాజకీయాలు చేసే ఈ నాయకులు ఇలా చేసినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ కొత్త తరహా రాజకీయాలు అంటున్న కమల్ మాత్రం కూతురు అక్షర విషయం ఏంటో ముందుగానే తేల్చి చెప్పాల్సిన అవసరం వుంది. ఆమె తన రాజకీయ వారసురాలా లేక వ్యక్తిగత సేవకురాలా అని.