ఎమ్మెల్యేకు అస‌లైన అర్ధం చెప్పిన సునీల్ ద‌త్

BJP MLA Sunil Dutt
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వెన‌క‌భాగంలో ఓ కారు….దానికి ముందు ఓ వ్య‌క్తి మ‌రొక‌రిని భుజంపైకి ఎక్కించుకున్న ఫొటో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సాధార‌ణంగా మ‌న కుటుంబ స‌భ్యుల‌కో , తెలిసిన‌వారికో ఏద‌న్నా ప్ర‌మాదం జ‌రిగితే…మ‌నం విల్ల‌విల్లాడిపోతాం. అందుబాటులో ఉన్న వాహ‌నంలో త‌క్ష‌ణ‌మే వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తాం…అక్క‌డ స‌రిప‌డా స్ట్రెచ‌ర్లు లేక‌పోతే…స్వ‌యంగా భుజాల‌పై మోసుకుని చికిత్స గ‌దిలోకి తీసుకెళ్తాం. ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తి చేసింది కూడా అచ్చంగా ఇలాగే. కాక‌పోతే ఆయ‌న ఇవ‌న్నీ చేసింది కుటుంబ స‌భ్యుల‌కో, తెలిసిన వారికో కాదు..అస‌లు ముఖ‌ప‌రిచ‌య‌మైనా లేనివారికి…ఆ చేసిన వ్య‌క్తి కూడా సాధార‌ణ పౌరుడు కాదు…అధికార పార్టీ ఎమ్మెల్యే. ఆయన పేరు మేజ‌ర్ సునీల్ ద‌త్ ద్వివేది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే అయిన సునీల్ ద‌త్…ప్రజాప్ర‌తినిధి అన్న ప‌దానికి స‌రైన అర్ధం చెప్పారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఫ‌రూఖాబాద్-ప‌తేగ‌ఢ్ ర‌హ‌దారిపై రెండు ద్విచ‌క్ర వాహ‌నాలు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో అర్వింద్ సింగ్, రిష‌బ్, రామేశ్వ‌ర్ సింగ్ అనే ముగ్గురు యువ‌కులు తీవ్ర గాయాల‌పాలై రోడ్డు మీద ప‌డిఉన్నారు.

అదే స‌మ‌యంలో అటుగా త‌న కారులో ప్ర‌యాణిస్తున్న సునీల్ ద‌త్ రోడ్డుపై క్ష‌త‌గాత్రులై ప‌డి ఉన్న వారిని చూశారు. త‌క్ష‌ణ‌మే కారు దిగి వారికి స‌ప‌ర్య‌లు చేశారు. అనంత‌రం ఆ ముగ్గురిని త‌న కారులో స‌మీపంలోని లోహియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆస్ప‌త్రిలో రెండే స్ట్రెచ‌ర్లు ఉన్నాయి. వాటిపై ఇద్ద‌రు క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రి సిబ్బంది లోప‌ల‌కు తీసుకెళ్లారు. మ‌రొక‌రికి స్ట్రెచ‌ర్ అందుబాటులో లేదు. దీంతో ఆల‌స్య‌మైపోతుంద‌ని భావించిన ఎమ్మెల్యే మిగిలిఉన్న బాధితుడిని త‌న భుజంపై ఎక్కించుకుని ఎమ‌ర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. అలా క్ష‌త‌గాత్రుణ్ణి భుజాల‌పై మోసుకుని తీసుకొస్తున్న ఎమ్మెల్యేను చూసి ఆస్ప‌త్రి సిబ్బందే కాదు… రోగులు, సంద‌ర్శ‌కులు సైతంఆశ్చ‌ర్య‌పోయారు. సునీల్ ద‌త్ ను వారంతా ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. ఎమ్మెల్యే అలా బాధితుణ్ని భుజం మోసుకొస్తున్న ఫొటోను ఆస్ప‌త్రి సిబ్బంది ఒక‌రు ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టంతో ఇప్పుడ‌ది వైర‌ల్ గా మారింది. నెటిజ‌న్లు సునీల్ ద‌త్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు. అధికార బీజేపీతో పాటు ఇత‌ర పార్టీ నేత‌లు కూడా సునీల్ ద‌త్ చేసిన ప‌నిని మెచ్చుకుంటున్నారు.