అనంతపురం జిల్లాకి చెందిన పరిటాల కుటుంబం అంటే తెలియని వారు బహుశా తెలుగు రాష్ట్రాల్లో లేరేమో. ఎందుకంటే జిల్లాలోనే కాక రాయలసీమలో తెలుగుదేశం పార్టీను లాక్కొచ్చిన నేత పరిటాల రవి. తొలుత ఎన్టీఆర్ పరిటాలను పట్టుబట్టి మరీ రాజకీయాలలోకి తీసుకోచ్చారు. ఆతర్వాత తన మీద ఎన్టీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అందుకే ఆ కుటుంబానికి అప్పుడు ఇప్పుడు ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే కమ్మసామాజికవర్గంలో ఎన్టీఆర్ తరువాత అంతగా ఆరాధించే వ్యక్తి పరిటాల రవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ కాంగ్రెస్ సర్కారులో మొద్దు శ్రీను చేతిలో పరిటాల దారుణహత్యకు గురయ్యారు. ఆ తరువాత రాజకీయ బాధ్యతలను రవి సతీమణి సునీత నెత్తికి ఎత్తుకున్నారు. కేవలం రాప్తాడు, పెనుగొండ నియోజకవర్గాల్లోనే కాకుండా జిల్లా పై పట్టు తెచ్చుకునేందుకు పరిటాల రవి తనయుడు శ్రీరామ్ చాలా పాటు పడ్డాడు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా స్పందిస్తూ వెళ్లి రాజకీయంగా తెరంగ్రేటం చేసి వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పరిటాల రవి పంధా అందరు రాజకీయ నాయకుల కంటే భిన్నంగా ఉండేది. ఆయన తన సామాజిక వర్గానికంటే ఎస్సీ, మైనార్టీలకే ప్రాధాన్యతనిచ్చేవారు. శ్రీరామ్ కూడా తండ్రి బాటలోనే అందర్నీ కలుపుకుని వెళుతున్నారు.
అయితే మరో పక్క ప్రస్తుత అనంత ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో అనంతపురం ఎంపీ సీటును తన వారసుడికి కావాలంటూ బాహాటంగానే అంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాను ఈసారి ఎన్నికల్లో నిలబడను అని తన బదులు సీటును తన కొడుకుకి ఇవ్వాలని ఆయన బాబు వద్ద అర్జీ కూడా పెట్టుకునట్టు జిల్లాలో ప్రచారం సాగుతోంది. అంతే కాకా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరిటాల ఫ్యామిలీపై సంచనల కామెంట్స్ చేశారు. ఇటీవల మరణించిన పరిటాల రవి అనుచరుడు చమన్‌సాబ్ మరణానికి కేవలం పరిటాల కుటుంబమే కారణమంటూ ఆరోపించాడు. పైగా శ్రీరామ్ దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు ప్రోత్సహిస్తూ కోట్లు దండుకుంటున్నాడనే ఆరోపణలు కూడా తమ కరపత్రం లాంటి పత్రిక సాక్షి ద్వారా మొదలుపెట్టారు. అయితే ఇదంతా రాజకీయంగా తనను ఇబ్బందికి గురిచేసేందుకు ప్రతిపక్షం ఆడుతున్న నాటకంగా పరిటాల శ్రీరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పుకొచ్చారు. పరిటాల కుటుంబం నుండి వారసుడిగా రానున్న శ్రీ రాం రాజకీయంగా ఎదగకుండా చేసేందుకు ఒకపక్క సొంత పార్టీ ఎంపీ తన వారసుడి కోసం, ప్రతిపక్ష పార్టీ తమ తమ అభ్యర్దులకోసం ప్రయత్నిస్తున్నారని పరిటాల వర్గం భావిస్తుంది. అయితే రాజకీయాల్లో ఉన్నా ఏనాడూ రాజకీయాలు చేయక కేవలం అక్కడి ప్రజలకి నాయకులుగా ఉన్న పరిటాల కుటుంబం ఈ అడ్డంకుల్ని ఎలా దాటుకుని రానున్న ఎన్నికల్లో నిలవబోతోందో కాలామే సమాధానం చెప్పాలి మరి.