ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 4వ తేదీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నారు. డిసెంబర్ 22వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఉభయ సభలు 19 రోజుల్లో సెలవులు మినహాయించి 15 రోజుల పాటు సమావేశమవుతాయని వెల్లడించారు.
ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై చర్చించే అవకాశం ఉందని ప్రహ్లోద్ జోషి తెలిపారు. వీటితోపాటు ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఈ సమావేశాల్లో వీటిని ఓ కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మరోవైపు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై “క్యాష్ ఫర్ క్వెరీ” ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్ సభ సెషన్లో ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్యానెల్ సిఫార్సు చేసిన బహిష్కరణ అమల్లోకి రాకముందే సభ నివేదికను ఆమోదించాల్సి ఉంటుంది.