కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా మే 3 వరకు లాక్డౌన్ లో కొనసాగనుంది. అయితే ఆ తర్వాత అయినా ఈ మానవాళికి రిలీజ్ ఉంటుందా? ఉండదా? అనేది కూడా సందేహంగా మారింది. అయితే ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో బ్యూటీపార్లర్లు, సెలూన్లు కూడా మూతపడ్డాయి. దీంతో కటింగ్, షేవింగ్ చేసుకోవడం కూడా పెద్ద ఇబ్బందికర అంశంగా పరిణమించింది. లాక్డౌన్ ఎత్తేసే వరకు ఇంకా ఎన్నిరోజులు పడుతుందో.. హెయిర్ కటింగ్ చేసుకోకుండా ఇంకా ఎన్నిరోజులు ఉండాలనే దానిపై ఆందోళన నెలకొంది. దీంతో బార్బర్ షాపులు, సెలూన్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా? అని చాలా మంది పడిగాపులు కాచుకొని ఎదురు చూస్తున్నారు.
అయితే ఇలాంటి సమయంలో శరత్ చంద్ర అనే వ్యక్తి ఏప్రిల్ 20 తర్వాత సెలూన్లు ఓపెన్ చేసే అవకాశం ఉందా? అంటూ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చారు. లేకపోతే.. తన భార్య హెయిర్ కట్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోందని కూడా వెల్లడించారు. అదే జరిగితే.. లాక్డౌన్ తర్వాత కూడా తాను ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని సరదాగా ట్విట్టర్ లో పేర్కొన్నాడు. దీనిపై కేటీఆర్ కూడా తమాషాగా చలోక్తులు విసిరారు.
అదేమంటే… భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే తనకు హెయిర్ కట్ చేయడానికి తన భార్య అనుష్క శర్మకు అవకాశం ఇచ్చాడని తెలియజేసి.. అంతటి వారే అవకాశాలు ఇచ్చిపుచ్చుకుంటుంటే.. నువ్వెందుకు ఆ అవకాశం ఇవ్వకూడదూ? అంటూ కేటీఆర్ వివరించారు. అలాగే.. నవ్వుతున్న ఎమోజీని కూడా అందుకు జత చేశారు. వెంటనే కేటీఆర్ ట్వీట్‌కు మాజీ ఎంపీ కవిత స్పందిస్తూ.. ‘అన్నయ్యా.. బాబీకి కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నావా? అంటూ ప్రశ్నించారు. కాగా వారి సంభాషణపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు గుప్పిస్తున్నారు. అవి ట్విట్టర్ లో వైరల్ గా మారాయి.