తనకు న్యాయం చేయాలని, తనపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక మహిళ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన ప్రశాంతి అనే మహిళ, అల్లిపురం చెరువుగట్టు ప్రాంతంలో నివసిస్తున్న శ్రీను, అతని భార్య, మరో ఇద్దరు జ్యోతి, రాణి, మాధవి తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే తాను శనివారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో స్టేషన్ ముందు తనతో తెచ్చుకున్న పెట్రోలు శరీరంపై పోసుకుంది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న మహారాణిపేట పోలీసులు అడ్డుకుని, టూ టౌన్ పోలీసులకు అప్పగించడంతో వారు ఆమెకు సపర్యలు చేసి కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందజేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వెంకటరావు తెలిపారు.