ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడు పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి రూ.3 లక్షల నగదు కాజేశాడు. ఆపై పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో మనస్తాపం చెంది ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు..బెంగళూరుకు చెందిన ఓ యువతి, అక్కడే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. మదనపల్లె రెడ్డీస్ కాలనీకి చెందిన ఇస్మాయిల్ కుమారుడు అబిద్ ఫేస్‌బుక్ ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. ఇది కాస్త ప్రేమగా మారింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించి ఆమె నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడు.
కొద్దిరోజులు గడిచాక ఇంటిపెద్దలు అంగీకరించలేదని పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో తట్టుకోలేకపోయింది. తనకు జరిగిన అన్యాయంపై యువతి ఈ నెల12న మదనపల్లెకు వచ్చి అతని ఇంటిముందు బైఠాయించింది. ఈ క్రమంలో గురువారం మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దీనిపై ఫిర్యాదు చేసింది. అనంతరం మదనపల్లెలోని ఓ లాడ్జిలో ఆమె తన సోదరుడితో కలిసి గదిని అద్దెకు తీసుకుని అక్కడే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను సోదరుడు లాడ్జీ సిబ్బంది సాయంతో స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.