అటవీ ప్రాంతంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. దుండగులు సదరు యువతిపై పెట్రోల్ పోసి అతి కిరాతకంగా కాల్చి చంపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని బండ్రుగొండ నుంచి పూసుగూడెంవైపు వెళ్లే అటవీ ప్రాంతంలో కాలిపోయిన యువతి మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలాన్ని డీఎస్పీ కె.ఆర్.కె.ప్రసాద్‌రావు, సీఐ నవీన్, సీఐ కె.శ్రీధర్ సందర్శించారు. దుండగులు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతిచెందిన యువతి ముఖం, శరీరం కాలిపోయి ఉంది. వంటిపై దుస్తులు పాక్షింగా కాలిపోయి ఉన్నాయి. ఆమెను గిరిజన యువతిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
అటవీ ప్రాంతంలో కాల్చి పడేసిన యువతి ఏ ప్రాంతవాసియో తెలియడం లేదు. పాల్వంచ, ములకలపల్లి మండలవాసినా? లేక ఇతర ప్రాంతవాసినా.. తెలియాల్సి ఉంది. దుండగులు లైంగికదాడికి పాల్పడి హత్య చేసి ఉంటారా? ప్రేమ వ్యవహారం కారణంగా హత్య చేసి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు పలు కోణాల నుంచి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.