కరీంనగర్ జిల్లాలో ఈరోజు దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకప్పుడు తనను ప్రేమించి ఇప్పుడు తనను దూరం పెడుతుందనే కారణంతో కరీంనగర్ కలెక్టర్ కార్యాలయానికి ఎదుటే ఆ యువతిని ఓ ప్రేమోన్మాది గొంతుకోసి హత్య చేశాడు. మృతురాలిని రామగుండంకు చెందిన రసజ్ఞ(22)గా పోలీసులు గుర్తిచారు. ప్రాధమికంగా అందుతున్న వివరాల మేరకు కరీంనగర్ జిల్లా కాటారం మండలం శంకరంపల్లి గ్రామానికి చెందిన వంశీధర్, గోదావరిఖనికి చెందిన రసజ్ఞ మధ్య గత మూడు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం ఉందని కాకపోతే గత కొద్దిరోజులుగా వంశీధర్ వేధింపులకు గురిచేయడంతో రసజ్ఞ అతడిని దూరం పెట్టింది. అతని ఫోన్ లకు కూడా సమాధానం ఇవ్వట్లేదు.
ఈ నేపథ్యంలో అతనికి దూరంగా మూడు నెలల క్రితమే జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న మీసేవా కేంద్రంలో ఉద్యోగంలో చేరింది. విషయం తెలుసుకున్న వంశీధర్ మీసేవా కేంద్రానికి చేరుకుని మాట్లాడాలని ఆమెను బయటకు పిలిచాడు. కొద్దిసేపటి తర్వాత సదరు యువతి పై కొడవలితో దాడి చేసి ఘాతుకానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన మీసేవా నిర్వాహకులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కొనఊపిరితో ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స మొదలు పెట్టబోతుండగా ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.