వివాహేతర సంబంధం మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేసింది. మొదట అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు తమదైన శైలిలో విచారించి నిందితులిద్దరిని కటకటాల వెనక్కి పంపించారు. కొందుర్గు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పొదిలి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన రూతమ్మ, వేణు దంపతులు. రూతమ్మకు గతంలో పొరుగు గ్రామానికి చెందిన శ్రీనుతో వివాహేతర సంబంధం ఉండేది.
విషయం తెలుసుకున్న ఆమె భర్త వేణు భార్యాపిల్లలను తీసుకొని కొందుర్గుకు వలస వచ్చాడు. ఓ ఇల్లు అద్దెకు తీసుకొని స్థానికంగా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న శ్రీనును ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన రూతమ్మ తన ప్రియుడితో కలిసి గతనెల 29 రాత్రి వేణు గొంతు నులిమి చంపేసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా తన భర్త అనారోగ్యంతో మృతిచెందిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో వేణు గొంతు నులిమి వేసినట్లుగా గాయాలు కనిపించాయి. గమనించిన కుటుంబసభ్యులు ఈనెల 1న కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్నగర్ రూరల్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో కేసు విచారణ చేపట్టారు. పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. అనుమానంతో రూతమ్మను అదుపులోకి తీసుకొని విచారించగా తన ప్రియుడు శ్రీను కలిసి వేణును హత్యచేసినట్లుగా నేరం అంగీకరించింది. ఈమేరకు మంగళవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.