బెంగళూరు నగరంలోని హుళిమావులోని తమ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న లివ్-ఇన్ పార్టనర్‌ను హత్య చేసిన మహిళను అరెస్టు చేశారు. సెప్టెంబరు 5న ఈ ఘటన జరగ్గా, ఇద్దరి మధ్య మనస్పర్థలు, ఆర్థిక సమస్యలే నేరానికి కారణమని అనుమానిస్తున్నారు.
హుళిమావు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మృతుడు 29 ఏళ్ల జావేద్‌గా గుర్తించారు. కేరళకు చెందిన అతడు నగరంలోని మొబైల్ సర్వీస్ సెంటర్‌లో పనిచేసేవాడు.
సెప్టెంబరు 5న, నిందితురాలు 34 ఏళ్ల రేణుకతో ఒకరి విశ్వసనీయతను మరొకరు అనుమానించుకుంటూ పోట్లాడుకోవడంతో జావేద్‌ను కత్తితో పలుమార్లు పొడిచింది. జావేద్‌కు రక్తస్రావం కావడంతో రేణుక ఇరుగుపొరుగుతో కలిసి ఆస్పత్రికి తరలించారు.
జావేద్ పరిస్థితి విషమంగా ఉందని గమనించిన ఆమె ఇంటికి తిరిగి వచ్చి తన లగేజీతో పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే అపార్ట్‌మెంట్ సిబ్బంది ఆమె ఇంటికి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రేణుకను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, దీనిపై తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
గత 10 రోజుల్లో నగరంలో లివ్-ఇన్ పార్టనర్లకు సంబంధించి ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోది. ఆగస్ట్ 28న, బేగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన లివ్-ఇన్ పార్టనర్‌ను చితకబాదిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య అనంతరం నిందితులు పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయారు.