భర్త వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాళ్లగూడకు చెందిన లావణ్య(32)కు ఎనిమిదేళ్ల క్రితం వెంకటేశం అనే జెట్ ఎయిర్ వేస్ పైలట్‌తో వివాహం అయింది. అయితే ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని వెంకటేశం తరచూ భార్యను వేధించేవాడు. దీంతో మనస్థాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన చావుకు భర్త వెంకటేశమే కారణమంటూ ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను విడుదల చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఆ వీడియోలో.. తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని పేర్కొంది. తనకు ఎంతో ప్రేమను పంచిన తల్లిదండ్రులను మోసం చేసి వెళుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘వాడి మీద ప్రేమ ఉంది.. అందుకే సూసైడ్ చేసుకుంటున్నాను. వాడు చేసేవి తట్టుకోలేక చనిపోతున్నాను. ఒకసారి ప్రేమిస్తే చచ్చేవరకు ప్రేమించాలని అనుకున్నాను. నేను తప్పులు చేసి రియలైజ్ అయ్యాను. కానీ, వాడు అవ్వటం లేదు… ’’ అంటూ కంటతడి పెట్టుకుంది.
లావణ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అల్లుడు వెంకటేశం తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు. శుక్రవారం ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎనిమిదేళ్లుగా నా కూతురిని అల్లుడు చిత్రహింసలకు గురి చేశాడు. మేం ఎక్కడ బాధపడతామో అని తను ఏనాడు మా దృష్టికి తీసుకురాలేదు. గతంలో లావణ్య గర్భవతిగా ఉన్న సమయంలో కడుపుపై తన్నడంతో అబార్షన్ కూడా అయింది. ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుని నా కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడు. వెంకటేశం చెన్నైకి చెందిన ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. లక్షల కొద్ది కట్నం కింద తీసుకున్నాడు. మాకు జరిగిన అన్యాయం ఏ తల్లిదండ్రులు జరగొద్దు. వెంకటేశంను బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలి’’అని డిమాండ్ చేశారు.