చిన్నచిన్న కారణాలకే కొందరు క్షణికావేశానికి లోనై మృత్యుమార్గాన్ని ఎంచుకుంటున్నారు. వారితో పాటు అన్నెంపుణ్యం ఎరుగని పిల్లలనూ బలి చేస్తున్నారు. భర్తతో గొడవ పడి మనస్తాపానికి గురైన ఓ మహిళ బుధవారం తనబిడ్డను బ్రిడ్జిపై నుంచి కిందకు విసిరి, తానూ దూకేసింది. అదృష్టం బాగుండి ఇద్దరూ ప్రాణాలతో బయటపడినా బాధితురాలు చేయి కోల్పోయింది. నగరంలోని బళ్లారి చౌరస్తాలో భర్త విశ్వనాథ్‌రెడ్డితో గొడవ పడి భార్య వాసవి తన బిడ్డతో సహా బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతపురం జిల్లా కొట్టాలపల్లి గ్రామానికి చెందిన విశ్వనాథ్‌రెడ్డికి, వెల్దుర్తికి చెందిన వాసవితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమారుడు ఆదర్శ ఉన్నాడు.
కుటుంబ కలహాలతో కొంతకాలంగా వీరు దూరముంటున్నారు. విశ్వనాథ్‌రెడ్డి ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేస్తూ కర్నూలులోని స్కందన్షీ హౌసింగ్ కాలనీలో నివాసముంటున్నాడు. వాసవి బుధవారం యాడికి నుంచి కర్నూలుకు వచ్చి బస్టాండ్ నుంచి భర్తకు ఫోన్ చేయగా, ఎందుకొచ్చావంటూ మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అందుకు మనస్తాపంతో ఆమె రెండేళ్ల కుమారున్ని బ్రిడ్జిపై నుంచి కిందకు విసిరి, తనూ దూకింది. ప్రమాదంలో ఆమె చెయ్యి విరిగిపోయింది. స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. సంవత్సర కాలంగా భర్తతో దూరంగా ఉంటడం వల్లే గొడవపడి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.