ఏపీలో వైసీపీ… బీజేపీ మధ్య.. మాటల యుద్ధం

కరోనా మహమ్మారితో ప్రపంచ అల్లకల్లోలం అవుతోంది. దీంతో దేశమంతా లాక్ డౌన్ లోకి వెళ్లింది. ఈ సమయంలో ప్రభుత్వాలు ఎంతో ఓర్పుగా ప్రజలకు రక్షణగా.. అండగా నిలబడుతూ నిరంతరం ప్రజాక్షేమమే దిశగా నానాపాట్లు పడుతున్నాయి. ఈ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల మధ్య తీవ్రమైన రాజకీయపు మాటల యుద్ధం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ తరహాలో ఇప్పుడు.. వైసీపీ వర్సెస్ బీజేపీ మధ్య వార్ అఫ్ వర్డ్స్ సాగుతున్నాయి. నేరుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలను సంధించారు.

ముఖ్యంగా చంద్రబాబుకు కన్నా అమ్ముడు పోయారని ఆరోపించారు. అంతేకాకుండా.. కన్నాకు చంద్రబాబు 20 కోట్లు ఇచ్చారని తన ఆరోపణలకు పదును పెట్టారు. అలాగే… ఏపీలో కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో వైసీపీ నేతలు ఈ తరహా విమర్శలు, ఆరోపణలు ఎందుకు చేస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కరోనా కట్టడి వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారనే వాదనా సాగుతోంది. ఇంకా కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్రం సీరియస్ గా ఉన్న సమయంలో బీజేపీపై వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా కాలు దువ్వుతున్నారు అనేది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అంతేకాకుండా కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యంలో ప్రజల ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా లాక్ డౌన్ ను విధించింది. ఆర్ధికరంగం తీవ్రంగా కుదేలౌతున్నప్పటికీ… ఈ లాక్ డౌన్ ను మే3 వరకు పొడిగించింది. కానీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనా విషయంలో అంత తీవ్రంగా స్పందించటం లేదనే విమర్శలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. కాగా విపక్షాలు ఈ అంశంపై దాడికి దిగుతున్నాయి. టీడీపీ తరహాలో బీజేపీ నేతలు కూడా విమర్శలు తీవ్రతరం చేస్తున్నారు. అందుకు వైసీపీ కూడా ఎదురు దాడి చేస్తుంది. కరోనా ఏపీలో రోజురోజుకూ వ్యాపిస్తున్న అందుకు నియంత్రణ చర్యలు తీసుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపడం, ఆగమేఘాల మీద రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావడం, యుద్ధ ప్రాతిపదికన కనకరాజు నియామకం వీటన్నింటినీ రాష్ట్ర బీజేపీ ఖండిస్తుంది.

అలాగే… జగన్ వైఖరిపై ఏపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆతృత ఎక్కువైందంటూ జగన్ పై విరుచుకు పడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన కరోనా కిట్ల ధరల వ్యత్యాసంపైన కన్నా కామెంట్ల వర్షం కురిపించారు. దక్షిణ కొరియా నుంచి ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఒక్కో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ను మూడు వందల ముప్పైకి కొనుగోలు చేస్తే.. ఏపీ సర్కార్ 700 రూపాయలకు కొనుగోలు చేసిందని తేలడంతో టీడీపీ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. దీంతో చేసేది లేక పలురకాలుగా ఏపీ ప్రభుత్వంపై ముప్పేట దాడి పెరగడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేరుగా కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించేస్తున్నారు.