అదే బావిలో రెండో యువతీ మృతదేహం…

ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ లో శ్రావణి అనే అమ్మాయి బావిలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపడం తెలిసిందే. శ్రావణిపై సామూహిక అత్యాచారం జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు ఏడుగుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో శ్రీనివాస రెడ్డి అనే నిందితుడిని విచారిస్తుండగా, మరో హత్య ఘటన కూడా వెలుగు చూసింది. మరో అమ్మాయి శవాన్ని కూడా ఆ బావిలో పూడ్చి పెట్టినట్టు చెప్పాడని తెలుస్తోంది. దీంతో మృతురాలిని నెలరోజుల కిందట అదృశ్యమైన మనీషాగా భావిస్తున్నారు. హాజీపూర్ గ్రామానికే చెందిన మనీషా డిగ్రీ విద్యార్థిని. మనీషా రెండు నెలల కిందట కనిపించకుండాపోయింది. అయితే.. మనీషా ఎవరైనా యువకుడితో ప్రేమలో ఉందేమోనని అతడితో వెళ్లిపోయి ఉంటుందని గ్రామస్థులు ఇప్పటివరకూ భావించారు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. తాజాగా ఆమె మృతదేహం బయటపడటంతో వారంతా షాక్‌కు గురయ్యారు. మనీషాకు తండ్రి లేడు. ఆమెకు ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. తల్లే నలుగురు పిల్లల్నీ పోషిస్తోంది. కాగా,హాజీపూర్ బావిలో మరో మృతదేహం లభించిందన్న సమాచారంతో పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సంఘటన స్థలానికి బయల్దేరారు. పోలీసులు మృతదేహం తవ్వితీసే క్రమంలో గ్రామస్తులను ఎవరినీ అక్కడికి రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ రెండు హత్యల వెనుక ఒకే వ్యక్తి ఉండుంటాడని భావిస్తున్నారు. శ్రావణి హత్య కేసులో ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు చెప్పిన సమాచారం మేరకే మనీషా మృతదేహాన్ని వెలికితీసినట్లు తెలుస్తోంది..